గ్రామాలు పరిశుభ్రతతో, పచ్చదనంతో వెల్లి విరియాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జూన్ 3 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె ప్రగతి, నాల్గవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పల్లె ప్రగతి సన్నాహక సమావేశమునకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందు ఉండడం ప్రజాప్రతినిధుల అధికారుల సమిష్టి కృషి అని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వాములను చేయాలని, గ్రామాల్లో సర్పంచులు అభివృద్ధి కార్యక్రమంలో పోటీ పడడం వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మంత్రి తెలిపారు.
జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. వైకుంఠ దామాలను సత్వరమే పూర్తి చేసి, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. మొక్కలు నాటేందుకు చెరువు గట్లను, పాఠశాల ఆవరణలను, క్రీడ ప్రాంగణాల స్థలాలను గుర్తించి పనులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులు పట్టణాల్లో కంటే గ్రామాల్లో బాగా మార్పు వచ్చిందని, వార్డు కమిటీలు చురుగ్గా పనిచేసేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. పాఠశాల పునః ప్రారంభంలోగా మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక చేయబడ్డ పాఠశాలలను సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గతంలో చేపట్టిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే వాటిని పూర్తి చేయాలని అన్నారు. నాలుగు విడతల పల్లె ప్రగతిలో చేపట్టిన విధంగానే పనులు చేపట్టి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమైందని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోను అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి, సంబంధిత శాఖల అధికారులతో పాటు ఎంపిపిలు, జెడ్పిటిసిలను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, 5వ విడత పల్లె ప్రగతి, 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఎమ్యెల్సీ సురభి వాణి దేవి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, జడ్పీసిఈఓ దిలీప్ కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.