గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా జరగాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 7 :

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా జరగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టర్ తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పర్యటింఛి గ్రామంలో కాలి నడకన వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య  పనులను తనిఖీ చేశారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు చనిపోయి వుండడం గమనించిన ఆయన వాటి స్థానంలో క్రొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. ఎండాకాలం కావున మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించాలన్నారు. మొక్కలకు సాసరింగ్ చేయాలని, గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించాలని ఆయన అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ప్రహారి గోడకు పెయింటింగ్ వేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చెత్తను కాల్చుతున్నట్టు, ఇది మంచిది కాదని, గ్రామానికి ట్రాక్టర్ వున్నదని, ప్రతి రోజు చెత్త సేకరణ జరగాలని, గ్రామంలో ఏర్పాటుచేసిన సేగ్రిగేషన్ షెడ్డుకు చెత్త తరలింపు జరగాలని ఆయన అన్నారు. పల్లె ప్రకృతి వనంలో ఖాళీ స్థలాన్ని మట్టితో నింపి, చిన్న పిల్లలకు ఆట వస్తువుల ఏర్పాటు చేయాలన్నారు. గడ్డి, కలుపు మొక్కలు తొలగించాలని, మొక్కలకు సక్రమంగా నీరందేలా చూడాలని అన్నారు. అనంతరం ఎస్ఆర్ఎస్పి కాలువను కలెక్టర్ పరిశీలించారు. కాలువ వెంబడి సేకరించిన భూమికి హాద్దు వెంట మొక్కలు నాటాలని ఆయన అన్నారు. కాలువలో నీరు వదలక ముందే పొదలు, గడ్డి తొలగించాలని, పూడిక తీయుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. కాలువ వెంబడి రైతులు సేకరించిన స్థాలంలోను పంట వేయుటకు సిద్దపడ తారని, కావున పంట వేయక ముందే వారికి హద్దు చూపెట్టి, కాలువకు సేకరించిన భూమిపై అవగాహన కల్పించి, అట్టి స్థలంలో పంట వేయకుండా చూడాలని ఆయన అన్నారు. అక్కడే మొక్కలు నాటుటకు గుంతలు తీస్తున్న ఉపాధి హామీ కూలీలతో కలెక్టర్, కూలీ డబ్బులు వస్తున్నది లేనిది, రోజుకు ఎంత వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. రోజు ఎక్కువ సేపు పనులు చేయాలని, గరిష్ట దినసరి కూలీ లభిస్తుందని అన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంలో జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, డిపిఓ జె. హరిప్రసాద్, ఇర్రిగేషన్ డిఇ బి. రమేష్ రెడ్డి, ఎంపిడిఓ బి. జయరాం, తహసిల్దార్ పుల్లయ్య, డిఎల్పిఓ ఆర్. పుల్లారావు, అధికారులు తదితరులు వున్నారు.

Share This Post