గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు:: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు

జనగామ, సెప్టెంబర్ 19: గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆదివారం మంత్రి పాలకుర్తి మండలంలోని శాతాపూర్, చెన్నూర్, పెద్దతాండ గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పాలకుర్తి మండలం, శాతాపూర్ గ్రామంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సిసి రోడ్లు, రూ. 2 కోట్ల అంచనాతో నిర్మించనున్న 40 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పనులకు మంత్రి శంఖుస్థాపనలు చేశారు. చెన్నూర్ గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితి భవనము, రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికలు, పెద్ద తండా గ్రామ పంచాయితీలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామ పంచాయితి ఆవరణలో మొక్కలు నాటి, గ్రామంలో వినాయక మండపము వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారని, దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందని అన్నారు. కరోనా కష్ట కాలం అభివృద్ధికి ఆటంకంగా మారిందని, ఇంత కష్ట కాలం లో ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు భీమా, పేదలకు ఇండ్ల నిర్మాణాలు ఆపలేదని మంత్రి తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు, దళితులకు దళిత బంధు ఇస్తున్నట్లు ఆయన అన్నారు. 57 సంవత్సరాల వయస్సు దాటిన వారికి వచ్చే నెల నుండి ఆసరా పెన్షన్లు మంజూరుచేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో ఇంటి నిర్మాణం కోసం స్థలం వున్న వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేపడతామన్నారు. ప్రజల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం దేశంలో లేదని ఆయన అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్త్రీ నిధి ఋణాలు అందజేస్తామని, మంచి ప్రాజెక్టుకు కోటి రూపాయల ఋణం ఇవ్వడానికైనా సిద్దమని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు శుద్ధి చేసి, రాష్ట్రంలోని ఇంటింటికి నల్లా ద్వారా త్రాగునీరు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఎక్కడా జరగని విధంగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మెడికల్ కిట్లు అందజేసినట్లు, మనోధైర్యం నింపి కాపాడుకోన్నట్లు మంత్రి తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో మాస్కులు, సానిటైజర్ల పంపిణి, ఆనందయ్య మందు పంపిణి చేపట్టినట్లు ఆయన అన్నారు. అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ పై ఎలాంటి భయం, అపోహ వద్దని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అయిన కరోనా వస్తే ప్రాణభయం ఉండదని, వ్యాక్సిన్ తో శరీరం తట్టుకొనే శక్తి వస్తుందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించడం, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చేయాలన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
మంత్రి పర్యటన సందర్భంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, స్టేషన్ ఘనపూర్ ఆర్డివో కృష్ణవేణి, జెడ్పి సిఇవో విజయలక్ష్మి, దిపివో రంగాచారి, దిఆర్దివో రాంరెడ్డి, పంచాయితీరాజ్ ఇఇ రఘువీరారెడ్డి, హౌసింగ్ నోడల్ అధికారి దామోదర్ రావు, పాలకుర్తి ఎంపిపి నాగిరెడ్డి, వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post