గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుంది- జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

ఆగష్టు 21, 2021ఆదిలాబాదు:-

మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రభుత్వాలు గ్రామస్థాయిలో అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. భారత్ కి ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో గ్రామీణ రోడ్ల సెమినార్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించినప్పుడే అభివృద్ధి జరుగుతుందని, అంతర్గత రోడ్లు కలపడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు. జిల్లాలో వెయ్యి కోట్ల నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి సూచనప్రాయంగా తెలిపారని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, భారత్ కి ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణం, నాణ్యత, రవాణా సౌకర్యాలు వంటి అంశాలపై సెమినార్ లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించవలసి ఉందని అన్నారు. వివిధ పథకాల ద్వారా పంచాయితీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపట్టి నిధులను ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పాటు  రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు కూడా సెమినార్ లు నిర్వహించాలని సూచించారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ, స్వాత్రంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తీ చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే స్వాతంత్య్రం వచ్చిందనే కల సాకారం అవుతుందని అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పేయ్ కాలంలో ప్రతి గ్రామానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్లను వేయడం జరిగిందని అన్నారు. రోడ్ల నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు సమస్యలు ఉన్నపటికీ పనులు నిర్వహిస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని, బాధ్యతగా నాణ్యతతో పనులు నిర్వహించాలని, ప్రస్తుతం చేపట్టే  ఎలాంటి నిర్మాణాలనైనా భవిష్యత్ లో గుర్తు చేసుకునే విధంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ లకు సూచించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై రోడ్ల నిర్మాణాలపై సాంకేతిక సందేశాన్ని అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫసర్ కుమార్ మొలుగారం మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణం వలన గమ్యానికి సురక్షితంగా చేరుకుంటామని అన్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం, విద్యాబ్యాసం కోసం, తదితర అత్యవసర పనుల కోసం క్షేమంగా సమయానికి గమ్యం చేరుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుండి కనెక్ట్ విటి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. నేషనల్ రురల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ వనరులను వినియోగించుకొని రోడ్ల నిర్మాణం చేపట్ట వచ్చని తెలిపారు. స్థానిక వనరులు, లభ్యత ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం తో రోడ్లను నిర్మించాలని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. అంతకు ముందు జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, జడ్పీటీసీ లు ఎంపీపీ లు మాట్లాడుతూ, ఆదిలాబాద్ మారుమూల గిరిజన జిల్లాలో వంద జనాభా గల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలో వివిధ పథకాల కింద రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నామని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీ ఫోరమ్ అధ్యక్షులు రాజు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఎస్ఈ వెంకట్ రావు, ఈఈ మహావీర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post