గ్రామ ఐక్య మహిళా సంఘాలు తమకు ఆదాయాన్ని అందించే చిన్న కుటీర పరిశ్రమలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మండల స్థాయి మహిళా సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులను కోరారు.

Press Release. Dt.19.8.2021

గ్రామ ఐక్య మహిళా సంఘాలు తమకు ఆదాయాన్ని అందించే చిన్న కుటీర పరిశ్రమలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మండల స్థాయి మహిళా సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులను కోరారు.

గురువారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మండల మహిళా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులకు నిర్వహించిన జీవనోపాదులపై అవగాహన, శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం16,011 మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 556 కోట్ల 26 లక్షల రూపాయలు రుణ లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటివరకు 5204 మహిళా గ్రూపులకు గాను 242 కోట్ల 67 లక్షలు రుణాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. స్త్రీ నిధి ద్వారా 107 కోట్లకు గాను 29 కోట్ల 44 లక్షల రూపాయలు రుణాలుగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పిండి మిల్లు, ఆయిల్ మిల్లు, కిరాణా దుకాణాలు, పప్పు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని, అందుకోసమే ఆ యంత్రాలు తయారు చేసే ప్రతినిధులతో ఈరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో యూనిట్ ఏర్పాటు చేసుకునే మహిళలకు విధివిధానాలను తెలుపాలని, గ్రామాలలో వీటి ఏర్పాటు కోసం గ్రామైక్య సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించారు. మార్కెట్లో అవసరమున్న మిల్లుల కు సంబంధించిన పనులపై పూర్తిగా శిక్షణ తీసుకోవాలని తెలిపారు. మెప్మా, మండల స్థాయిలో ఏర్పాటు చేసుకునే చిన్న పరిశ్రమలకు స్థలము కూడా చూపించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలు ప్రగతిపథంలో ఉన్నాయని, మహిళలకు రుణాలు ఇస్తే మంచిగా పెంపు చేసుకుంటారని అన్నారు. చిన్న పరిశ్రమలకు సంబంధించి ఆలోచన చేశామని, మహిళలకు అవసరమైన పనులు పైనే శ్రద్ధ పెట్టామని అన్నారు. మహిళా సంఘాలకు ఏవి అవసరమో గుర్తించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన చేసుకునే మార్గం కోసమే ఈ శిక్షణా కార్యక్రమని అన్నారు. ఇలాంటి మిల్లుల ద్వారా కల్తీ లేని ఆహారం కూడా లభ్యమవుతుందని, తద్వారా మహిళలు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామ ఐక్య సంఘానికి పిండి, పప్పు, ఆయిల్ మిల్లులు అందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిలయన్స్ ఫౌండేషన్ వారు ఇలాంటి మహిళా అభివృద్ధి కార్యక్రమాలలో స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని, మహిళలలను ఇంకా పైకి తీసుకురావాలనే కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు.

శిక్షణా కార్యక్రమంలో బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, హైదరాబాద్ ప్రతినిధి శేషసాయి, సిబ్బంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ మిల్లులకు సంబంధించిన వివరాలను, ఉపయోగించే పద్ధతులను మహిళా సంఘాలకు వివరించారు.

శిక్షణా కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవ రావు, అడిషనల్ పిడి మురళీకృష్ణ, డి పి ఎం రమేష్, వివిధ మండలాల మహిళా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
…DPRO. KMR.

Share This Post