గ్రామ రెవిన్యూ అధికారులను ఇతర శాఖలకు కేటాయింపు :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

 

ఖమ్మం, ఆగస్టు 1:

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రెవిన్యూ అధికారులను ఇతర శాఖలలోని జూనియర్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ పోస్టులకు కేటాయింపులు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారుల సమక్షంలో లాటరీ పద్దతిలో పూర్తి పారదర్శకంగా, వీడియోగ్రఫీ తో గ్రామ రెవిన్యూ అధికారుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ రెవిన్యూ అధికారులను ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా వివిధ శాఖలకు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 310 మంది గ్రామ రెవిన్యూ అధికారులకుగాను, జిల్లాలో ప్రభుత్వంచే ఖాళీల ఆమోదం మేరకు 236 మందిని జిల్లాలోని జిల్లా, డివిజన్, మండల స్థాయి వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయించినట్లు ఆయన అన్నారు. ఇందులో బిసి సంక్షేమ శాఖకు 24, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం 12, ఉన్నత విద్య 34, పోలీస్ 13, పురపాలన, పట్టణాభివృద్ధి 41, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి 15, ఎస్సి సంక్షేమం 21, సెకండరీ విద్య 12 మందిని కేటాయించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగులు 74 మంది గ్రామ రెవిన్యూ అధికారులలో 15 మంది జిల్లా కలెక్టర్, మహబూబాబాద్, 59 మందిని జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం కు వారి వారి జిల్లాల్లో ఖాళీల భర్తీకి గాను కేటాయించుట జరిగిందని ఆయన తెలిపారు. ప్రక్రియ అంతయూ పూర్తి పారదర్శకంగా చేపట్టినట్లు, వీడియోగ్రఫీ చేయించినట్లు కలెక్టర్ అన్నారు. కేటాయించిన స్థానాల్లో ఈ రోజే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారిచేసినట్లు ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post