ప్రచురణార్థం……1
తేదీ.6.1.2023
గ్రామ రెవెన్యూ సదస్సులు ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
,
జయశంకర్ భూపాలపల్లి
జనవరి 6
రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.శుక్రవారం భూపాల్ పల్లి మండలం పంబాపూర్ గ్రామంలో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
పంబాపూర్ గ్రామంలో ఉన్న భూ సమస్యకు సంబంధించి ఎమ్మెల్యే గ్రామస్తులు తన దృష్టికి పలు మార్లు తీసుకుని వచ్చారని, సర్వే నెంబర్ 246 లో ఉన్న 500 ఎకరాల ప్రభుత్వ భూమి సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న రైతులకు నిబంధనల మేరకు పట్టా భూమి పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా ప్రజల వద్దకు వచ్చి రైతుల భూ సమస్య పరిష్కారమవుతాయని, దీని కోసం అవసరమైన సౌలభ్యాన్ని ధరణిలో కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
గతనెలలో ఎమ్మెల్యే గారితో కలిసి రేగొండ మండలం రామన్నగూడెం గ్రామంలో 662,663 సర్వే నెంబర్ లో ఉన్న 400 మంది రైతులకు సంబంధించిన భూ సర్వే పూర్తి చేశామని, త్వరలో పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని అన్నారు.
అదే విధంగా కాటారంలో 501 సర్వే నెంబర్ లో 800 ఎకరాలు 600 మంది రైతులకు అందించేందుకు సర్వే చేపట్టామని, చిట్యాల మండలంలోని చైన్ పాక, నైన్ పాక
నవాబ్ పేట గ్రామాల్లో సమస్యలను, రేగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సమస్యలను, భూపాల్ పల్లి మండలంలోని గుర్రంపేట గ్రామ సమస్యల పరిష్కారానికి సైతం చర్యలు చేపడుతామని కలెక్టర్ తెలిపారు.
భూ సమస్యల పరిష్కారం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, మీ సేవా లో దరఖాస్తు కూడా అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు సర్వే బృందాలు 30 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తాయని, సర్వే నిర్వహణ తర్వాత మ్యాపింగ్ చేసి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి, వివరాలు ప్రజలకు తెలిపి అభ్యంతరాలు స్వీకరించి ధరణి లో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఉన్న 221 రెవెన్యూ గ్రామాలలో వచ్చే 4 మాసాలుగా కాలంలో పూర్తి స్థాయిలో భూ సమస్యల పరిష్కారం చేస్తామని కలెక్టర్ తెలిపారు. భూమి పట్టాలు తీసుకోవడం వల్ల రైతుబంధు సహాయం, బ్యాంకులలో రుణాలు అనేక సదుపాయాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు.
అనంతరం కలెక్టర్ గ్రామంలోని రైతులకు ఉన్న వివిధ సందేహాలను నివృత్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు.
ధరణి భూ సమస్యల పరిష్కారంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో ఉందని ఇక్కడి జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల కేంద్రంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు.
భూ సమస్యల పరిష్కారం సమయంలో ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో బీటీ రోడ్డుల నిర్మాణానికి సహకరించిన కలెక్టర్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించిన తర్వాత అటవీశాఖ రెవెన్యూ శాఖ వివాదాల్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ చోరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గ్రామ సదస్సు నిర్వహణ కంటే ముందు భూపాల్ పల్లి మండలం లోని రూరల్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. పంబాపూర్ గ్రామంలోని సుద్దవాగు పై నిర్మించిన 4.00 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జి ఎమ్మెల్యే ప్రారంభించారు.
పంబాపూర్ గ్రామంలో రూ.20లక్షల నిధులతో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు, దీక్షకుంటా గ్రామంలో రూ.42లక్షలతో దీక్షకుంటా నుంచి పంబాపూర్ గ్రామానికి బీటి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రమేష్ గౌడ్ గ్రామ సర్పంచ్ జడ్పిటిసి ఎంపీపీ ఎంపీటీసీ స్థానిక ప్రజా ప్రతినిధులు భూపాలపల్లి తహసిల్దార్ ఇక్బాల్, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది