గ్రీవెన్స్ డే సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డే ను పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం సువర్ణాపురం గ్రామానికి చెందిన ఎస్కె. మీరాబీ, తన భర్త కరోనా తో మరణించినట్లు, తనకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం మంజూరుకు కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని విచారణ చేసి, తగుచర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం నుండి నాగలక్ష్మి, సత్యవతి, విజయలక్ష్మీ, మాధవి లు తమకు దళితబంధు పథకం క్రింద షీప్ యూనిట్లు మంజూరు అయినట్లు, ఇంతవరకు గ్రౌండింగ్ చేయలేదని, గ్రౌండింగ్ చేయాలని కోరగా, అదనపు కలెక్టర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి చర్యలకై ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం మంగలగూడెం నుండి రాయల వెంకటయ్య, సర్వే నెం. 192 లో చట్ట విరుద్ధంగా పాస్ పుస్తకాలు జారీచేసారని, విచారణ చేసి తగుచర్యలకు కోరగా, ఖమ్మం రూరల్ తహసీల్దార్ ను తగుచర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురం నుండి వనం కృష్ణకాంత్ కోదాడ-ఖమ్మం 365ఏ జాతీయ రహదారి నిర్మాణం పేరుతో మండలంలోని వనరుల దోపిడీ చేస్తున్నట్లు తగు చర్యలకై కోరగా, నేషనల్ హైవే వారిని ఇట్టి విషయమై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వేంసూరు మండలం రాయుడుపాలెం నుండి సిహెచ్. రాధారాణి అంగన్వాడీ ఆయా పోస్టులో నియామకం గురించి కోరగా, జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలనకై ఆమె ఆదేశించారు. కామేపల్లి మండలం ఉట్కూరు నుండి ఎస్కె ఖాసిం, గ్రామంలోని మసీదుకు సంబంధించి వివరాలు కోరగా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ అసోసియేషన్ వారు, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేసిన ఆప్టోమ్స్ ను రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా దరఖాస్తు ద్వారా కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని పరిశీలించి, తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సుందరయ్య నగర్ నుండి తోట నాగమ్మ తన ఇంటి ప్రక్క రెండు ఖాళీ ప్లాట్లు చెత్త చెదారం తో నిండివున్నాయని శుభ్రం చేయించుటకు కోరగా, మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు వెంటనే చర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శాఖల వారిగా పెండింగ్ గ్రీవెన్స్ లను సమీక్షించారు. గ్రీవెన్స్ లను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రీవెన్స్ వెబ్ సైట్ లో దరఖాస్తుల పరిష్కారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.