ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని బీసీ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.

నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా తో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు అతిథిగా కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106 జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన గావించి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, కొండ లక్ష్మణ్ బాపూజీ మారుమూల గ్రామంలో జన్మించారని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, తెలంగాణ కై ఆశగా శ్వాసగా జీవించాలని అని ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ తరఫున ఆయన వాదించారని, చాకలి ఐలమ్మ భూస్వాముల దొరలతో వీరోచితంగా పోరాడితే దానిలో కూడా నిర్భయంగా ధైర్యంగా వకాలత్ పుచ్చుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ వారిపై వాదించారని, అటు స్వాతంత్ర ఉద్యమంలో, ఇటు తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.

1952 లో ఆసిఫాబాద్ నుండి శాసన సభ్యునిగా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగి 1969లో మంత్రిగా ఉండి తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం అనే మాట అప్పుడే ఆయన తోనే ప్రారంభం అయిందని తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా ఇచ్చిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.

స్వాతంత్రం కొరకు పూజ బాపూజీ ఏ విధంగా సత్యాగ్రహ ఉద్యమం చేసిండో అదేవిధంగా శాంతియుతంగా ఉద్యమం చేశారని తెలిపారు.

ఆంధ్ర వాళ్ళు తెలంగాణను వెనుకబడిన ప్రాంతం అంటే వెనక బడిన ప్రాంతం కాదు వెనక పడేసిన ప్రాంతమని ధైర్యంగా మాట్లాడారని అన్నారు. 2009లో నిజామాబాద్కు కొండా లక్ష్మణ్ బాపూజీ ధర్నా చౌక్ లో పాల్గొన్నారన్నారు.

నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పోరాట వీరుడు మన తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అహర్నిశలు పరితపించారని ఊహ తెలిసిన నాటి నుండి కన్ను మూసే చివరి రోజు వరకు తెలంగాణ కోసం జీవించాలని ప్రశంసించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ని ప్రేమతో తెలంగాణ బాపూజీ అని సగౌరవంగా పిలుచుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు ఎలాంటి పదవులు అవసరం లేదని శపథం చేసిన మహనీయులు 1997 సంవత్సరంలో ఢిల్లీలో ఆయన చివరి రోజుల్లో చల్లని చలిలో ఉద్యమ పోరాటం చేశారని తెలిపారు. వారి త్యాగ ఫలితం మనం ఈరోజు అనుభవిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా సంఘం అధ్యక్షులు సత్యపాల్, సెక్రెటరీ బిల్లా మహేష్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, నరాల సుధాకర్, వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు మాయ వారి రాజేశ్వర్, బిసి సంక్షేమ శాఖ నర్సయ్య , గంగాధర్, సోషల్ వెల్ఫేర్ భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post