నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
“నా తెలంగాణ కోటి రతనాల వీణ ” అని మంత్రి వేముల తన ప్రసంగాన్ని ప్రారంభించి, వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు.
ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనసభ్యులు గణేష్ గుప్తా, ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు, అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీ ఎఫ్ ఓ సునీల్, డీసీపీ వినీత్, రెడ్ కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన మంత్రి, కలెక్టర్
ఇదిలాఉండగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం,15 ఏళ్ల కేసిఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి వేముల అన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయం అని, రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు.
————————