ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు – రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించింది

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది

రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉంది

రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తో పట్టణ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి……

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధమైన విధానాలు ఆర్థిక క్రమశిక్షణ తో అన్ని రంగాలలో ముందంజలో ఉందని రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు.

రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ అన్ని విధాల రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా కు గోదావరి జలాలు తరలించాలని, జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయడానికి, కాలంతో పనిలేకుండా పంటలకు సాగునీరు అందించేలా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ రెండు ఎత్తిపోతల ద్వారా జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

రైతు బంధు పథకం కింద గత 8 విడతలలో 21.76 లక్షల మంది రైతులకు రూ.2,536 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. తొమ్మిదవ విడత రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భీమా పథకం కింద 919 మంది రైతులకు రూ.45.95 కోట్లు అందజేసినట్లు తెలిపారు.

జిల్లాలో 150 గ్రామాలలో రోజుకు 7 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని, 20 విజయ డైరీ పార్లర్లు నెలకొల్పి సుమారు ఆరు వేల లీటర్ల పాలు, పాల పదార్థాలు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో 1068 నీటి వనరులలో వంద శాతం సబ్సిడీపై 3.76 కోట్ల రూపాయల విలువ గల 3.58 కోట్ల చేప పిల్లల పెంపకం చేపట్టి, 16,174 టన్నుల చేపల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు.

రబీ సీజన్లో 155 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసామన్నారు.

దళిత బంధు పథకం కింద జిల్లాలో 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇప్పటివరకు 381 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో నాలుగు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 76 కోట్ల రూపాయలు మంజూరు అయినవని,ఇప్పటివరకు రెండింటి నిర్మాణాలు పూర్తై విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయనీ తెలిపారు.

కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులతో సేవలందిస్తున్నామనీ, జిల్లాలో ఆరు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఏడు బస్తీ దావఖానలు జిల్లాకు మంజూరైనట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12,847 కెసిఆర్ కిట్ల పంపిణీ చేశామన్నారు.

జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నొస్టిక్ ఏర్పాటు చేసి 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. గుండెపోటు బాధితులకు స్టేమి తో సత్వర వైద్యం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో త్వరలో పూర్తి హిప్ మార్పిడి మరియు మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ, విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో 441 పాఠశాలలను ఎంపిక చేసామని, పాఠశాల పున ప్రారంభం నాటికి అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ క్రీడ ప్రాంగణం పేరిట క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా జిల్లాలో మొదటగా మండలానికి రెండు మోడల్ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో అర్హులైన లక్షా 35 వేల మందికి ప్రతి నెల 30 కోట్ల 49 లక్షల రూపాయల ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

హరితహారం కార్యక్రమం లో రోడ్డుకిరువైపులా చెట్ల పెంపకం లో గత సంవత్సరం సంగారెడ్డి మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని, అదేవిధంగా పిఎం స్వనిధి క్రింద వీధి వ్యాపారులకు మొదటి విడత రుణాల మంజూరులో జహీరాబాద్ మున్సిపాలిటీ దేశంలో ఆరవ స్థానం, సంగారెడ్డి మున్సిపాలిటీ 9వ స్థానంలో నిలిచిందని తెలిపారు. రెండవ విడత రుణాల మంజూరులో సంగారెడ్డి దేశంలో ఏడవ స్థానం జహీరాబాద్ 10వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.

ఈ నెల 3 నుండి ప్రారంభమయ్యే ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. 8వ విడత హరితహారాన్ని విజయవంతం చేసి జిల్లాను హరిత జిల్లాగా రూపొందించాలని కోరారు.

జిల్లాలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా లైసెన్స్ ఫీజుగా 34 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం లభించిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద 32,786 మంది లబ్ధిదారులకు రూ.328.24 కోట్లు, షాదీ ముబారక్ పధకం క్రింద 8,780 మంది లబ్ధిదారులకు
రూ. 87.90 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర మరియు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణకుమార్,.అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, డి ఆర్ వో రాధికా రమణి, జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారి, తహసిల్దార్, వివిధ శాఖల ఉద్యోగులు, అమరవీరుల కుటుంబాల వారు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post