చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…. ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు జడ్జి. బి. పాపిరెడ్డి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…. ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు జడ్జి. బి. పాపిరెడ్డి

ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సాధారణ పౌరులకు న్యాయ సేవలు, చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా న్యాయ సేవాధికారిత సంస్థ సేవలను క్షేత్ర పరిధికి తీసుకెళ్లాలన్నదే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. క్షేత్ర పరిధి వరకు ప్రతి వ్యక్తికి చట్టాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని తెలిపారు.
మండలంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందని, ఏ సమస్య ఉన్నా సంప్రదించవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ,మహిళలు ,నిరుపేదలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు కల్పించడం జరుగుతుందన్నారు.

మొదటి అదనపు సెక్షన్ కోర్టు న్యాయమూర్తి కె. సునీత మాట్లాడుతూ చేసే ప్రతి పని చట్టంతో ముడిపడి ఉంటుందన్నారు. ఏది తప్పు ఏది ఒప్పు అన్నది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తప్పని తెలిసినా చేయడం నేరమని, మన ఆలోచనా విధానం మారాలన్నారు. చాలా చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకోవాలని, చట్టంలో పొందుపరచిన అంశాలను అవగాహన చేసుకోవాలన్నారు. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. ఎవరి వంతు వారు సమాజానికి సేవలు అందించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పరిష్కారం కానీ ఎన్నో కేసులను రాజీ కుదిర్చి పరిష్కరించిన ఘనత జిల్లా న్యాయమూర్తి కే దక్కుతుందన్నారు. లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సఖి సెంటర్ ద్వారా అద్భుతమైన సేవలు అందుతున్నాయని నిరుపేదలకు సంబంధించిన ఏ సమస్యనైనా న్యాయసేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అన్ని గ్రామాల్లో కి లీగల్ సర్వీసెస్ ఉన్నదన్న విషయాన్ని తీసుకెళ్లాలని తెలిపారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ సిహెచ్.ఆశాలత లీగల్ సర్వీసెస్ అథారిటీ పనితీరు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయాలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవ సదస్సులు, అవగాహన క్యాంపుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.

సఖి, భరోసా కేంద్రంల ద్వారా అందిస్తున్న సేవలు, ఏ విధమైన సహాయం అందుతుంది, ఎలాంటి చట్టాల రక్షణ లభిస్తుందన్న విషయాలపై ఆయా అధికారులు వివరించారు.
అనంతరం సఖి కేంద్రం సేవలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా జడ్జి విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, గవర్నమెంట్ ప్లీడర్ నర్సింగరావు, పిపి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, డి ఆర్ డి ఓ ఏ పి డి సూర్యారావు, సి డి పి వో లు, సర్పంచులు ,మహిళలు, పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడి టీచర్లు, ఆటో డ్రైవర్లు, వివిధ వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post