ప్రచురణార్ధం:
ఆగష్టు 23 ఖమ్మం:
చిన్నారులను న్యుమోనియా నుండి రక్షించుకునేందుకు జిల్లాలో పి.సి.వి న్యుమోనియా టీకాను అందుబాటులోకి తెచ్చామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ‘గ్రీవెన్స్ డే”లో చిన్న పిల్లల న్యుమోనియా వ్యాక్సిన్ గురించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ గతంలో కేవలం ప్రయివేటు ఆసుపత్రులలో ఒక డోసు సుమారు 3 వేల రూపాయలను తీసుకునే న్యుమోనియా వ్యాక్సిన్ను ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పేదప్రజలకు ఉచితంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, చిన్నారులందరికి ఇట్టి వ్యాక్సిన్ ఇప్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి న్యుమోనియా వ్యాక్సిన్ గురించి వివరిస్తూ మూడు డోసులతో చిన్నారులకు ఇట్టి వ్యాక్సిన్ వేస్తారని అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని ఆరు వారాల లోపు మొదటి డోసు, 14 వారాలకు రెండవ డోసు, 9 నెలలకు బూస్టర్ డోసు వేయడం జరుగుతుందని చిన్న పిల్లలకు వేసే ఇతర టీకాలతో పాటుగా న్యుమోనియా వ్యాక్సిన్ వేయించవచ్చని, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇట్టి టీకాను తమ పిల్లలకు వేయించడం ద్వారా చిన్న పిల్లల్లో 80 శాతం న్యుమోనియా నుండి రక్షణ కల్పిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. పోషకాహారం లోపం కలిగిన, వైరస్ సోకిన చిన్నారులకు న్యుమోనియా త్వరగా సంక్రమించే అవకాశముంటుందని, దానితో పాటు బ్యాక్టీరియా, ఫంగస్ ద్వారా కూడా సంక్రమిస్తుందని, పి.సి.వి న్యుమోనియా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నారులలో న్యుమోనియా శాతం చాలా వరకు తగ్గిందన్నారు. గ్రామాలలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ, మున్సిపల్ ప్రాంతాలలో మెప్మా సిబ్బంది, ఇట్టి వ్యాక్సినేషన్ పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి చిన్నారులందరికి న్యుమోనియా టీకా వేసేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు.
అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా॥అలివేలు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.