చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉంటేనే మెరుగైన సమాజం – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉంటేనే మెరుగైన సమాజం – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉంటేనే మెరుగైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. గత సెప్టెంబర్ లో జరిగిన పోషన్ అభియాన్ కార్యక్రమంలో చిన్నారులలో సామ్–మామ్ ఎక్కువగా ఉన్నారని గుర్తించి జీరో శాతానికి తేవడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అన్నారు. అందులో భాగంగా సోమవారం చిన్నశంకరంపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసి టీచర్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 21 నుండి నరసాపూర్ , మెదక్, అల్లాదుర్గ్, రామాయమపేట్ అంగన్వాడీ కేంద్రాలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి సెక్టార్ వారీగా పిల్లల బరువులు, కొలతలు తీస్తున్నామని అన్నారు. ఈ కేంద్రానికి వచ్చిన 50 మంది పిల్లల తల్లిదండ్రులు హాజరు కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విధంగా అంగన్వాడీ టీచర్లు తమ భాద్యతలను గుర్తెరిగి గ్రోత్ మానిటరింగ్ చేసినట్లయితే పిల్లల ఆరోగ్య స్థితితో పాటు తక్కువ బరువు పిల్లలకు డాక్టర్ల సమక్షంలో అదనపు ఆహారం అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
జిల్లాలో 1076 అంగన్వాడీ కేంద్రాలలో 5 సంవత్సరాలలోపు ఉన్న సుమారు 60 వేల మంది పిల్లల బరువును, ఎత్తును, బుజం చుట్టుకొలతలను తీస్తున్నామని ఆమె తెలిపారు. ఈ నెల 21 నుండి 25-30 కేంద్రాలను ఒక సెక్టారుగా విభజించి చురుకుగా ఉన్న 400 మంది అంగన్వాడీ టీచర్లతో పిల్లల గ్రోత్ తీస్తూ అట్టి వివరాలను పోషన్ ట్రాకర్ లో పొందుపరుస్తున్నామని ఆమె తెలిపారు. కురచగా, బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు సూపెర్వైజరీ ఫీడింగ్ అనగా కేంద్రాలలో రెగ్యులర్ గా ఇస్తున్న పాలు, గ్రుడ్డు, ఒక పూట భోజనం కు అదనంగా పౌష్టికాహారం అందించాలని ఆమె అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ప్రతి మాసం పిల్లల బరువు , ఎదుగుదలను తీస్తూ వివరాలను రికార్డులో నమోదు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో పిల్లలలో పౌష్టికాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

చిన్నారులు వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఉండాలని అప్పుడే శారీరకంగా దృడంగా, చలాకీగా ఉంటారని అన్నారు. పుట్టిన ఆరు మాసాల వరకు తల్లి పాలు శ్రేష్టమని, అప్పటి వరకు పాప బరువును మాత్రమే చూడాలని, 7 వ మాసం నుండి 5 సంవత్సరాల వరకు చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రులకు హితవు చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆరోగ్యవంతమైన పిల్లలను దేశానికి అందించిననాడే దేశం అభివృద్ధి పధంలో పురోగమిస్తుందని అన్నారు. కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్ తమ కేంద్రం పరిధిలోని పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా ఎదిగేలా చూడాలని, ప్రతి మాసం బరువును తూచాలని, వారి తల్లిదండ్రులకు కూడా పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించేలా అవగాహన కలిగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రామాయమపేట్ సి.డి.పి .ఓ. రాథోడ్, సూపర్ , వాహిని, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Share This Post