చిరు వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతి కోసం వెండార్స్‌ జోన్‌ : పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత

చిరు వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతి కోసం వెండార్స్‌ జోన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో వీధి విక్రయదారుల దుకాణాల సముదాయాన్ని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు మాట్లాడుతూ చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతి మున్సిపల్‌ పరిధిలో వెండార్స్‌ జోన్స్‌ ఏర్పాటు చేసే దిశగా కృషి చేయడం జరుగుతుందని, పట్టణాలలో పేదరిక నిర్మూలన, పట్టణ ఆధునీకరణ, సుందరీకరణ దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పారిశుద్ధ్యం, వీధి దీపాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 10 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో చిరు వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం 24 షాపులతో వెండార్స్‌ జోన్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, చిరు వ్యాపారం చేసుకునే వారందరికి ఒకే చోట వ్యాపారం చేసుకునే విధంగా ఈ సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రోడ్ల ప్రక్కన వ్యాపారం సాగించడం వలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని, ఎండాకాలం, వర్షాకాలంలో వ్యాపారం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వెండార్స్‌ జోన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రోడ్లపై వ్యాపారం సాగించే వారందరు ఈ జోన్‌లో తమ వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చని, ప్రజలకు సైతం అన్ని రకాల వస్తువులు, సరుకులు, కూరగాయలు ఒకే చోట లభిస్తాయని, ట్రాఫిక్‌ మస్య సైతం పరిష్కారమవుతుందని తెలిపారు. జిల్లాలో ఐ.టి.ఐ. కూడలి వద్ద మరొక వీధి విక్రయదారుల దుకాణ సముదాయం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ బాలకృష్ణ, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌, కౌన్సిలర్‌ జగ్గారి సుమతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post