చెంచు పెంటల్లోని ప్రతి కుటుంబం నుండి పోడు భూమి హక్కులకై దరఖాస్తు తీసుకునే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

చెంచు పెంటల్లోని ప్రతి కుటుంబం నుండి పోడు భూమి హక్కులకై దరఖాస్తు తీసుకునే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయాన్నే ఐ.టి.డి.ఏ, డి.ఎఫ్.ఓ, ఆర్డీఓ తదితర అధికారులతో అప్పాపూర్, మల్లా పూర్ తదితర చెంచు పెంటలను సందర్శించి గ్రామ సభలు నిర్వహించారు. అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హాబీటేషన్ల పెంటల ప్రజలతో గ్రామ సభను ఏర్పాటు చేసి పోడు భూమి దరఖాస్తు చేసుకోవడం పై అవగాహన కల్పించారు. తాము సాగు చేస్తున్న భూముల పై హక్కులు పొందేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని దీనిని ప్రతి ఒక కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబీకుల పై సక్సేషన్ (విరాసత్) చేసుకోదల్చిన చెంచులు సైతం తమ దరఖాస్తు చేసుకోవాలన్నారు. పెంటల్లో నివసించేవారు ఇళ్ల స్థలం, కమ్యూనిటీ అవసరాలైన పాఠశాల, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రం తదితర అవసరాలకు భూమి కేటాయింపు కోరుచు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వాల్సిందిగా తెలియజేసారు. పంచాయతీ సెక్రెటరీ, ఉపాధిహామీ సిబ్బంది ఇతర సిబ్బంది కడప కడపకు వెళ్లి పోడు భూమి దరఖాస్తులు సాయంత్రం లోగా తీసుకురావాలని ఆదేశించారు. లింగాల, అమ్రాబాద్, అచ్ఛం పేట లోని అన్ని చెంచు పెంటల నుండి దరఖాస్తులు తీసుకురావాలని ఆదేశించారు. అర్హత ఉండి తెలియక ఏ ఒక్కరూ తాము దరఖాస్తు చేసుకోలేదు అనడానికి వీలు లేకుండా ప్రతి కుటుంబం నుండి సేకరించాల్సిందిగా ఆదేశించారు. అనంతరం అక్కడి ప్రజల స్థితిగతులు అవసరాల పై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్బంగా పెంట ప్రజలు వారికి కావలసిన మౌళిక సదుపాయాలు సక్రమంగా తాగు నీటి సరఫరా, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం, పక్కా ఇళ్లు, కళ్యాణాలక్ష్మి, ఆధార్ కార్డు వంటి సమస్యలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు, తాగునీరుకు వెంటనే బోరు రిపేర్ చేయించి క్రమం తప్పకుండా మంచినీటి సరఫరా చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారిని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలకు ఓవర్ హెడ్ ట్యాన్క్ ద్వారా మంచినీరు అందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏ.ఈ ని ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కింద ఉపాధిహామీ కింద అక్కడ ఉన్న బావుల పూడిక తీసే కార్యక్రమం చేపట్టాలన్నారు. అప్పాపూర్ పెంటలో నివాసానికై కట్టుకున్న ఇళ్లు కురుస్తున్నాయని Qకలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే తార్ కవర్లతో మిద్దెలు కురువకుండా చర్యలు చేపట్టాలని పి.ఓ ఐ.టి.డీఏ అశోక్ ను ఆదేశించారు. మన్ననూర్ లో ప్రత్యేక ఆధార్ క్యాంపు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆధార్ తీసుకునే విధంగా చూడాలని, మార్పులు చే ర్పులు వంటివి సైతం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఆధార్ తో పాటు అక్కడే బ్యాంక్ అకౌంట్ లేని వారందరికీ జిరో అకౌంట్ తెరిపించాలని సూచించారు. అక్కడి ప్రజల ఉపాధి , వ్యవసాయం పై ఆరా తీశారు. మల్లాపూర్ పెంటలో ప్రజలు మాట్లాడుతూ తమకు ఉపాధికై వ్యవసాయం చేసులోవాలనుకుంటున్నామని, కానీ ఎడ్లు లేకపోవడంతో కేవలం ట్రాక్టర్ ద్వారా ఒక సారి దున్ని విత్తనాలు వేసిపోతే తర్వాత గుంటుక, కలుపు కొరకు దంతే లేకపోవడంతో పంటలు సరిగ్గా పండటం లేదన్నారు. అదేవిధంగా అడవి పందులు దాడి చేసి ఉన్న పంటను నాశనం చేస్తున్నాయన్నారు. మాకు ఎడ్లు, ఇచ్చి చెనుకు ఫెన్సింగ్ చేయిస్తే వ్యవసాయం చేరుకుని బతుకుతామని కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా తమ ఊరిలో అంగన్వాడీ పోస్టు భర్తీ చేయాలని, బోరు పనిచేయక తాగు నీటికి కష్టాలు పడుతున్నామని, బ్రిడ్జ్ స్కూల్ కు శాశ్వత భవనం నిర్మించి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ను కోరారు. ఇందుకు కలెక్టర్ ఆర్.డబ్ల్యూ. ఇంజనీరును తగు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే బోర్లకు మరమ్మతు చేయించాలని అదేవిధంగా బావుల్లో పూడిక తీయించాలని ఆదేశించారు. పెంటల్లో నివసించే ప్రజలకు ముందుగా అన్ని మౌళిక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పి.ఓ.ఐ.టి డి ఏ అశోక్, డి.ఎఫ్.ఓ కిష్టాగౌడ్, ఆర్డీఓ పాండు నాయక్, తహసీల్దార్ మునిరుద్దీన్, సర్పంచు బాల గురువయ్య, ఇతర అధికారులు, పెంట ప్రజలు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

Share This Post