చెంచు పెంటల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు చెంచుల జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది- జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన
తేది: 27-9-2022
నాగర్ కర్నూల్ జిల్లా
చెంచు పెంటల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు చెంచుల జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం లింగాల మండలంలోని ఎర్రపెంట, కొండనాగుల గ్రామాలను సందర్శించారు. (ఆర్.డి.టి.) కేంద్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చెంచుపెంటల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఎర్ర పెంటలో చెంచుల జీనోమ్ జన్యు పరిశోధన కై కేంద్ర సంస్థ సి.సి.యం.బి ( సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాల్క్యులర్ బయాలజీ) సేకరిస్తున్న రక్త నమూనా కేంద్రాన్ని సైతం పరిశీలించారు. ఇక్కడి ప్రజల్లో ఎవరికైనా ఏమైనా జబ్బులు ఉన్నా, రక్తహీనత ఉన్న గుర్తించి నివేదిక ఇవ్వాలని సిసిఎంబి సిబ్బందిని ఆదేశించారు. పెంటలోని చెంచులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు రోజు తప్పించి రోజు వస్తుందని ప్రతి రోజు వచ్చేవిధంగా చూడాలని కలెక్టర్ ను కోరారు. దగ్గరలోని వాగులో నాణ్యమైన ఇసుక దొరుకుతుందని ఇక్కడి ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీసుకోడానికి అనుమతి ఇవ్వాలని చెంచులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్.డి.టి ద్వారా చెంచులకు మంజూరు చేసిన 37 పక్కా ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అవకాశం ఉంటే దగ్గర్లోని వాగు నుండి ఇసుక తీసుకోవటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. చెంచుపెంటల్లో విరాసత్ దస్త్రాలు పెండింగ్ లో ఎన్ని ఉన్నాయని తహసిల్దార్ ను ప్రశ్నించారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ ద్వారా పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు అందరికి పడుతున్నాయ లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా చేయాల్సినవి అన్ని సదుపాయాలు చేస్తుందని గ్రామ పంచాయతీ సైతం నిధులు సమకూర్చుకొని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గర్భిణీల కు వైద్య చికిత్స కై 102 అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చే విధంగా చూడాలని, ఆర్.డి.టి ఉన్న ప్రాంతాల్లో ఆశ వర్కర్ తో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఫోన్ చేసిన 102 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. శ్రీరంగాపూర్ గ్రామస్థులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అటవీ శాఖాధికారులు కొత్తగా ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతించడం లేదని కలెక్టర్ ను కొరగా కమ్యూనిటీ రైట్స్ కింద దరఖాస్తులు చేయించాలని పంచాయతి సెక్రటరీ ని ఆదేశించారు. మరుగుదొడ్లు అవసరమైన వారికి త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం కొండనాగుల గ్రామంలో చెంచు మహిళల స్వయం ఉపాధి కై ఆర్.డి.టి ద్వారా ఏర్పాటు చేస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. 4 కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కో సెంటర్ లో 25 మంది చెంచు మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి మిషన్లు సైతం వారికే ఇవ్వనున్నట్లు రీజినల్ జాయింట్ డైరెక్టర్ పుష్ప కలెక్టర్ కు వివరించారు. అక్కడ శిక్షణ కై విచ్చేసిన మహిళలతో కలెక్టర్ మాట్లాడుతూ బాగా నేర్చుకొని పెంటల్లో జీవనోపాధి పొందాలని సూచించారు. త్వరలోనే ఈ కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడం జరుగుతుందన్నారు.
ఆర్.డి.టి ప్రాంతీయ సంచాలకులు పుష్ప, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, లింగాల తహసిల్దార్, స్థానిక సర్పంచు, సిసిఎంబి సాంకేతిక అధికారి జగ్మోహన్ చట్టాయి, ప్రాజెక్టు అసోసియేట్ నెహాసింగ్ తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
—————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post