చెక్ డ్యాంల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15: జిల్లాలో ప్రగతిలో ఉన్న చెక్ డ్యాంల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని చాంబర్ లో నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు మొత్తం 24 చెక్ డ్యాంలు మంజూరు కాగా, ఇప్పటివరకు 8 పూర్తయ్యాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న 16 చెక్ డ్యాంల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా చెక్ డ్యాంల నిర్మాణం కోసం భూసేకరణ అవసరం అయితే వెంటనే భూ సేకరణ చేసి, నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో గతంలో వచ్చిన వరదలు పునరావృతం కాకుండా వరద నీటిని మల్లించడానికి చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గుడి చెరువు పనుల ప్రగతిపై కలెక్టర్ ఆరా తీశారు. అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తాను స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో చెక్ డ్యాంల నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తానని ఆయన అన్నారు. మానేరు వాగుపై కరకట్ట ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ఈఈ అమరేందర్ రెడ్డి, డీఈలు జే. సంతోష్, టి. ప్రశాంత్ కుమార్, బి. నర్సింగ్, ఎం. రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post