జంతువులు, వన్యప్రాణుల పట్ల కరుణతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష సూచించారు. జనవరి 14 నుండి 31వ తేదీ వరకు జరుగుచున్న జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ విడోయో కాన్ఫరెన్స్ హాల్లొ జంతు సంక్షేమ సంస్థ చైర్మన్/ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువులను హింసించడం వాటిని బహిరంగంగా బలిచేయడం, వన్యప్రాణులను వేటాడటం వంటివి నేరంగా పరిగణించడం జరుగుతుందని హెచ్చరించారు. జంతువులు, వన్యప్రాణుల పట్ల కరుణ చూపించాలని ఎక్కడైన దొరికిన అటవీ శాఖ వారికి అప్పగించడం, అడవిలో వదిలేవేయడం చేయాలని తెలిపారు. పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు రోగనిరోధక టీకాలు ఇప్పించాలని తద్వారా రేబిస్ లాంటి ప్రాణాంతక వ్యాధి నుండి జంతువులతో పాటు మనుషులు రక్షణ పొందవచ్చని సూచించారు. మాంసానికి ఉపయోగించే మేకలు, గొర్రెలు వాటిని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా స్లాటర్ కేంద్రాల్లోనే వధించాలని అదికూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్యంతో లేదని డాక్టర్ ద్వారా ధ్రువీకరణ పొందాకే బలిచేయాలన్నారు. వీధి కుక్కలను నియంత్రించడానికి కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. రోడ్ల పై పశువులు చాలా కూర్చుంటున్నాయని వాటిని గోశాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జంతువులను వాహనంలో తరలించేటప్పుడు ఒకే వాహనంలో ఇరుకుగా ఎక్కువ జంతువులను తరలిస్తే గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ ద్వార రూపొందించిన కరదీపికను విడుదల చేసారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, జిల్లా పశు సంవర్ధక అధికారి డా. శ్రీనివాస్, అటవీ శాఖ నుండి శ్రీనివాసులు, డైరీ ఫామ్ నుండి మెంబర్లు జి. రాఘవ రెడ్డి, గోశాల నుండి మెంబర్ అశోక్ , తదితరులు పాల్గొన్నారు.