జగత్ పల్లి, అచ్యుతాపురం, మనిగిళ్ళలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,    తేది:7.12.2021,  వనపర్తి.

యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
మంగళవారం జిల్లా పరిధిలోని జగత్ పల్లి, అచ్యుతాపురం, మనిగిళ్ళలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, అదేవిధంగా వనపర్తి మునిసిపాలిటీలోని 12 వ. వార్డులో ఇంటింటికి వెళ్లి, సందర్శించి  వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు 17 శాతం లోపు తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, జిల్లాలో 230 వానకాలం కొనుగోలు కేంద్రాల (IKP) ద్వారా 55 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
యాసంగిలో వరి ధాన్యాన్ని (FCI)  కొనుగోలు చేయనందున రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని, ప్రత్యామ్నాయ పంటలు ఐన వేరుశనగ, మినుము, పెసర ,శనగ, ఆముదం, కుసుమ, ఆయిల్ ఫామ్, కూరగాయలు తదితర వంటి పది రకాల పంటలు సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతులు, వ్యవసాయ అధికారుల సమన్వయంతో ఆరుతడి పంటలను పండించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నదని, డిసెంబర్ చివరి నాటికి రెండు లక్షలు లక్ష్యంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. మొదటి డోసు వేసుకోనివారు 45 వేల మంది ఉన్నారని, వారు తక్షణం వేయించుకోవాలని, రెండవ డోస్ తీసుకోవాల్సిన వారు 1 లక్షా 60 వేల మంది అర్హులుగా ఉన్నారని ఆమె తెలిపారు. ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి, 18 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. గ్రామాలలో జడ్పిటిసి, ఎంపిపి, ఎంపీటీసీ, సర్పంచ్, వైద్యశాఖ, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి, వందశాతం మొదటి, రెండవ డోసు వేసుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
……………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post