జనాభా నియంత్రించడంలో పురుషుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేలా పురుషులకు అవగాహన కల్పించాలి – జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు

జనాభా నియంత్రించడంలో పురుషుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేలా పురుషులకు అవగాహన కల్పించాలని వైద్య అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సూచించారు .

గురువారం అదనపు కలెక్టర్ తిరుపతి రావు ఛాంబర్ లో వ్యాసెక్టమీ ఆపరేషన్ స్పెషల్ డ్రైవ్ పై వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ స్పెషల్ డ్రైవ్ ఈ నెల 29 నుండి డిసెంబర్ 4 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా పురుషుల భాగస్వామ్యం పెంచేందుకు వైద్య అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ శాఖ, విద్యా శాఖ, జిల్లా సంక్షేమ శాఖ లతో సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు.

పురుషులు ఈ ఆపరేషన్ చేయించుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగవని, కోత లేకుండా, కుట్టులేని అతి సులువైన వ్యాసెక్టమీ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చారని, ఆపరేషన్ 5 నుండి 15 నిమిషాలలో పూర్తి చేయడం జరుగుతుందని, ఆపరేషన్ అయిన మూడు రోజుల నుండి అన్ని పనులు చేసుకోవచ్చని ఎటువంటి అపోహాలకు తావులేదని, ఈ నెల 30వ తేదీన సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, డిసెంబర్ 1వ తేదీన శంషాబాద్ ఏరియా హాస్పిటల్ లో , 2వ తేదీన షాద్ నగర్ ఏరియా హాస్పిటల్ లో , 3వ తేదీన చేవెళ్ల ఏరియా హాస్పిటల్ లో, 4వ తేదీన కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి అదనపు కలెక్టర్ కు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్య శాఖ అధికారి సూసిందర్ రావు, డిప్యూటీ డి ఎమ్ అండ్ హెచ్ ఓ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post