జలయజ్ఞంలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వట్టెమ్ నిర్వాసితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం వట్టెమ్ గ్రామ పరిధిలో వెంకటాద్రి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు 466 మంది భునిర్వాసితులకు ఒక్కొక్కరికి 250 చదరపు గజాల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ఇందులో బిజినేపల్లి మండలం అంకంపల్లి వారు 34 మంది, అంకంపల్లి తాండ నిర్వాసితులు 116, కోరుకొండ తాండ 213, జీ గుట్ట తాండ 58, రాంరెడ్డిపల్లి తాండ నిర్వాసితులు 45 మంది నిర్వాసితులు ఉన్నారు. ఇక్కడ నిర్మించే ఈ ఊరికి అన్ని రకాలైన మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజ్, పార్క్, పాఠశాల, దేవాలయం వంటి సకల వసతులు కల్పించడం జరుగుతుందని, ఈ పనుల పురోగతి పై ప్రతి 15 రోజులకోసారి స్వయంగా సమీక్ష చేస్తానని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి లేదా శాసన సభ్యుల దృష్టికి, ప్రజాప్రతునిధుల దృష్టికి తీసుకురావాలని మా పరిధిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. నాణ్యత విషయంలో రాజీపడమని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ భునిర్వాసితులు తమ భూములు, ఇళ్లు సర్వం కోల్పోయి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారని కొనియాడారు. ఇక్కడి భునిర్వాసితుల అభ్యర్థన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఏ ఆర్.అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చారో అదే ప్యాకేజ్ ని వట్టెమ్ నిర్వాసితులకు ఇవ్వడం జరిగిందన్నారు. కొంత మంది ప్రాజెక్టు పై కేసులు వేయడం మూలంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఆలస్యమయ్యిందని అన్నారు. ఒక్కో ఇంటికి ప్యాకేజ్ కింద 12.50 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. వాటికి అదనంగా తన సొంత డబ్బుల నుండి రెండు తాండలకు తప్ప మిగిలిన వారికి ఒక్కో ఇంటికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగిందని త్వరలో మిగిలిన రెండు తాండాలకు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ 466 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుంటే అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నందున ఇక్కడ భూమికి మంచి డిమాండు వస్తుందన్నారు. ఇళ్లు నిర్మించుకునే వారికి తక్కువ ధరకు ఇసుక లభించే విధంగా చూడాలని కలెక్టర్ ను కోరారు. చేపల సంపద విషయంలో ఇతర ప్రాజెక్టులో ఏ విధంగా నిబంధన ఉందొ అదేవిధంగా ఇక్కడ భూ నిర్వాసితులకు అందేవిధంగా చూస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, ఆర్డీఓ నాగలక్ష్మి, తహసిల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిరణ్, జడ్పి టీసీలు, ఎంపీపిలు,కోరుకొండ సర్పంచు రమణి, రాంరెడ్డి పల్లి తాండ సర్పంచ్ లక్ష్మి, నిర్వాసితులు పాల్గొన్నారు.