జవహార్ నగర్ ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం
జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని జవహార్‌నగర్ ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు వారందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు.
శనివారం రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జవహార్‌నగర్‌లోని ట్రీట్మెంట్ అండ్ డిస్ప్లే ప్లాంట్ ఫర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎమ్ఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించేందుకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తామని మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.