జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాల నిర్వహణ:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఇంటింటా జాతీయ జెండా ఎగుర వేయాలి
స్వాతంత్ర సమరయోధుల పూర్తి భావితరాలకు అందించాలి
ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి
ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
పెద్దపల్లి ఆగస్టు 9:- జిల్లాలోని ప్రజలలో జాతీయ భావం పెంపొందించేలా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం అమర్ చంద్ కళ్యాణమండపంలో నిర్వహించిన ఇంటింటా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ లో స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి 200 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా స్వాతంత్రం లభించిందని, అనేక మహనీయుల త్యాగఫలం మనం ప్రస్తుతం ఉంటున్న స్వతంత్ర భారతదేశం అని మంత్రి తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అనేకమంది జైలు జీవితం గడిపారని, బ్రిటిష్ వారు విధించే చిత్ర వేదనలను భరిస్తూ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల అందరికీ మనం కృతజ్ఞతతో ఉండాలని మంత్రి సూచించారు.
మన హృదయాన్ని కదిలించే అనేక స్వాతంత్ర పోరాట సంఘటనలను భావితరాలకు అందించేందుకు వేడుకలను వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రజలు గ్రామస్థాయి నుంచి పాల్గొని విజయవంతం చేయాలని, అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమర్థవంతంగా వేడుకలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
జిల్లాలో చదువుతున్న దాదాపు 42095 మంది విద్యార్థులకు స్వాతంత్ర పోరాటం గురించి వివరించేలా గాంధీ సినిమా ప్రదర్శిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గాంధీ సినిమా చూడాలని మంత్రి సూచించారు.
ఇంటింట జాతీయ జెండా పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, దాదాపు కోటి 20 లక్షల జెండాలను తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై అవసరమైన మర్యాదలు పాటిస్తూ జెండా ఎగురవేయాలని మంత్రి కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని మాట్లాడుతూ మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహనీయులు త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రం వేడుకలను దేశంలోనే అత్యధిక ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకుంటున్నామని అన్నారు. మహనీయుల ఆశయసాధనకు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులు, పేదలు, మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని, ఐటీ , వ్యవసాయం, వైద్య విద్యా రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని ఎంపీ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆగస్ట్ 8, 2022 నుంచి ఆగస్టు 22,2022 వరకు సీఎం కేసీఆర్ వివిధ కార్యక్రమాలను రూపొందించారని అన్నారు. ప్రతి ఇంటికి స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఆగస్టు 11న ప్రతి మండలంలో, మున్సిపాలిటీ లో నిర్వహించే ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలోని ప్రతి ఇంటికి మున్సిపాలిటీలు , గ్రామ పంచాయతీల ద్వారా జాతీయ జెండాను పంపిణీ చేస్తామని,
జాతీయ జెండాను అతి పవిత్రంగా భావించాలని, దాని పట్ల భక్తి భావనలు కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు స్వాతంత్ర దినోత్సవం నాడు నియమ నిబంధనలు పాటిస్తూ జాతీయ జెండా అవసరమైన మర్యాద అందిస్తూ ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద జెండా ఎగురవేయాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య స్ఫూర్తి, గొప్పతనం ప్రతి ఒక్కరికి వివరించే విధంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, జాతీయ జెండా ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాలని అన్నారు.
అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పెద్దపల్లి వార్డు సభ్యులు, జర్నలిస్టులకు మంత్రి జాతీయ జెండాలు పంపిణీ చేశారు
అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి, జిల్లా అధికారులు కళాకారులు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.