తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జాతీయ స్వాతంత్ర నాయకుల విగ్రహాల ఆవిష్కరణ వారి జీవిత లక్ష్యాలు, ఆశయాలను భావితరాలకు అందించేందుకు దోహద పడుతుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్టేషన్‌రోడ్‌లో గల గాంధీ పార్కులో 15 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ కాంస్య విగ్రహాలను జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పెంట రాజయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్‌తో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దేశ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన మహానుభావుల విగ్రహాల అవిష్కరణ, వారు అనుసరించిన మార్గాలు, ఆశయాలు భావితరాలకు తెలిపేందుకు మంచి అవకాశమని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 మున్సిపాలిటీలో జిల్లా కేంద్రంలో ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, మంచిర్యాల పట్టణం వ్యాపార కేంద్రంగా కొనసాగుతుందని, మంచిర్యాల మున్సిపాలిటీలో చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలతో మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. దేశ స్వాతంత్రo కోసం శాంతి, అహింస మార్గాల కోసం పోరాడి సాధించిన జాతి పిత మహాత్మా గాంధీ అందరికి ఆదర్శమని, గాంధీజీ స్ఫూర్తితో అనేక దేశాలలో అహింసా మార్గాలలో పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్న చరిత్ర ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రభాగాన నిలువడంలో దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి అనిర్వచనీయమని తెలిపారు. ఇలాంటి మహానుభావుల విగ్రహాలను ఆవిష్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం రైల్వేగేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయుచున్న అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, గుత్తేదారుకు సూచనలు, సలహాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్‌చైర్మన్ గాజుల ముఖేష్‌గౌడ్, కౌన్సిలర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.