జాతీయ రహదారుపై ఏర్పడిన గుంతలను తక్షణం మరమ్మత్తులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు

భద్రాద్రి కొత్తగూడెం::- సెప్టెంబర్ 17, 2021.

ప్రచురణార్ధం

జాతీయ రహదారుపై ఏర్పడిన గుంతలను తక్షణం మరమ్మత్తులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ ప్రాంతీయ అధికారి కెస్కే కుష్వహా, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పట్టణంలోని ముర్రేడు, గోధుమవాగులపై నిర్మిస్తున్న వంతెనలు, సుభాష్ చంద్రబోస్ నగర్, సింగరేణి మహిళా కళాశాల ప్రహరిగోడ, సెయింగ్ మేరీస్ పాఠశాల ప్రహరి పనులును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రహదారులపై ఏర్పడిన గుంతలు వల్ల ప్రజలు ప్రమాదాలకు గరయ్యే అవకాశం ఉందని కాబట్టి అత్యంత ప్రాధాన్యతతో మరమ్మత్తులు నిర్వహించాలని చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న రెండవ వంతెన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయు విధంగా కార్యాచరణ తయారు చేయాలని సంస్థ అధికారులను ఆదేశించారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న శ్రీ సీతామరాచంద్రస్వామి వారి దర్శనానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు వెళ్లుటకు రెండవ వంతెన ఎంతో అవసరమని చెప్పారు. రెండవ వంతెన నిర్మాణ పనుల్లో చాలా జాప్యం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వంతెన నిర్మాణ పనులను దక్కించు కున్న రాజీప్ సంస్థ తప్పుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, నిర్మాణ పనులను సంస్థ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెంలో ముర్రేడు, గోధుమ వాగులపై నిర్మిస్తున్న వంతెనల నిర్మాణాల్లో భూమి, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు చేసి సమస్యను పరిష్కరించాలని అదనపు కలెక్టర్కు సూచించారు. పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నదని, ప్రజలు రాకపోకలు చేయుటకు వంతెనల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ నగర్లో వర్షపు నీరు వల్ల ఇండ్లు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి బాక్స్ కల్వర్టులు నిర్మించాలని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి వర్షపు నీరు నిల్వలేకుండా సాఫీగా వెళ్లుటకు బాక్సు కల్వర్టుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ముసలిమడుగు వద్ద రహదారి విస్తరణకు కావాల్సిన అటవీ భూమిని కేటాయించాలని అటవీ అధికారులకు సూచించారు. ఇల్లందు నుండి బయ్యారం వరకు జాతీయ రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయాలని ఆయన కేంద్ర హెూంశాఖ ప్రాంతీయ అధికారిని కోరారు. గిరిజనులు అధికసంఖ్యలో నివసిస్తున్న ఈ జిల్లా అభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమని చెప్పారు. జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనున్న కూడళ్లులో ప్రమాదాలు నివారణకు హైమాస్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతీయ రహదారులకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న అన్ని పనులు యొక్క సమగ్ర నివేదికలు అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చి మాసం నాటికి జాతీయ రహదారులు అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు. జాతీయ రహదారులపై వేగనియంత్రణ, ప్రమాదకర జోన్స్ వంటి హెచ్చరికల సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా పారిశ్రామికంగా సమగ్ర అభివృద్ధి చెందుతున్నదని కాబట్టి రహదారులు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర మంత్రిత్వ ప్రాంతీయ అధికారి కెస్కే కుష్వహా మాట్లాడుతూ ఇల్లందు – కొత్తగూడెం, ఇల్లందు – బయ్యారం రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు చెప్పారు. రహదారులు, వంతెనల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను పరిష్కరించుటకు జిల్లా కలెక్టర్ తీసుకున్న చొరవను ఆయన ప్రశంసించారు. గోధుమవాగు, ముర్రేడు వంతెనల నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం చెల్లించి రానున్న మార్చి మాసం వరకు వంతెనలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాజీప్ నిర్మాణ సంస్థ యండి రాజీవ్ కటారియా, ర.భ. ఈ ఈ భీమ్లా, ఎఫ్ఓ అప్పయ్య, జిసిసి జియం వాణి, సింగరేణి సివిల్ డిప్యూటి జియం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post