జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా సాంస్కృతిక ప్రదర్శనలు

 

జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా సాంస్కృతిక ప్రదర్శనలు

దేశభక్తి, తెలంగాణా ఉద్యమ నేపథ్యంగా ప్రదర్శనలు

ప్రదర్శనలను వీక్షించి మంత్రముగ్దులైన వీక్షకులు
—————————————-

తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో  నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా అలరించాయి.

సిరిసిల్ల పట్టణంలోని డా.సినారె కళామందిరంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి, తెలంగాణ జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు ఎస్పీ డి.చంద్రయ్య, హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వందలాది మంది వీక్షకులు సాంస్కృతిక కళా ప్రదర్శనలను తిలకించేందుకు తరలిరాగా, జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, యక్షగాన కళాకారులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుంద‌ని, దేశంలో మొట్టమొదటిసారిగా సమైక్యత కోసం నినదించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. త్యాగ‌ధ‌నుల‌ అలుపెరుగని పోరాటం వల్లనే ఈరోజు మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నామని, కానీ కొన్ని అసాంఘీక శక్తులు అవాస్తవాలని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ గతాన్ని స్మరించుకుంటూ భవిష్యత్ ను నిర్మించుకోవాలని, చరిత్రలో జరిగిన వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు, అందరూ సమైక్యంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ గడ్డపై చరిత్ర వక్రీకరణలు పనిచేయవని స్పష్టం చేశారు. నేటి తరానికి వాస్తవ పరిస్థితులను తెలియజేసే కర్తవ్యం మనందరిపై ఉందని గుర్తు చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో భాగమై 75 సంవత్సరాలలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో వేడుకలు నిర్వహించడం హర్షణీయమన్నారు. దేశభక్తి, తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా సాంస్కృతిక కళా ప్రదర్శనలు చేసిన కళాకారులు, చిన్నారులను అభినందించారు.

అనంతరం కళారంగంలో విశేష సేవలందించిన కళాకారులకు ,రచయితలకు శాలువా , ప్రశంసా పత్రాలు, శాలువాతో అతిథులు సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ విశ్వ ప్రసాద్, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి, H & T AD సాగర్ తదితరులు పాల్గొన్నారు.

—————————————————

Share This Post