పత్రికా ప్రకటన
సంగారెడ్డి, జూలై 29:–
జిన్నారం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ధరణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.
గురువారం నాడు జిన్నారం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రికార్డులను పరిశీలించారు. ధరణి సంబంధిత విషయాలలో పలు సూచనలు చేశారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలుగుతామని అన్నారు. ఏ విషయంలోనూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు.
కార్యాలయంలోని అన్ని సెక్షన్లను తిరిగి పరిశీలించారు. ఆయా సెక్షన్లలో చేస్తున్న పనుల వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రజలకు మంచి సేవలు అందించేలా పనిచేయాలని సూచించారు. పనులు పారదర్శకంగా ఉండాలని, ఏ విషయంలోనూ జాప్యం తగదని హితవు పలికారు.ధరణి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు.
అనంతరం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం బాగుందని సర్పంచ్ అభినందించి సన్మానించారు. తడి పొడి చెత్తను విడివిడిగా నిరంతర ప్రక్రియగా సేకరించాలని సూచించారు.
కలెక్టర్ వెంట తహసిల్దార్ దశరథ్, సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు.