జిల్లాలోని అట్రాసిటీ పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

అధికారులు, ఎస్‌.సి., ఎస్‌.టి. అట్రాసిటీ కమిటీ సభ్యులు చట్టంపై ప్రజల్లో పూర్ణి స్థాయి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో డి.సి.పి. ఉదయ్‌కుమార్‌తో కలిసి ఎ.సి.పి.లు, రాజస్వ మండల అధికారులు, ఎస్‌.సి., ఎస్‌.టి. అట్రాసిటీ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌.సి., ఎస్‌.టి. విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందని, చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగ పర్చుకోవాలని, బాధితులకు న్యాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం జిల్లాలో నమోదు అయిన అట్రాసిటీ సంబంధిత కేసులపై చర్చించారు. 2015 సం॥లో 1, 2018 సం॥లో 2, 2019లో 4, 2020లో 4, 2021లో 52 మొత్తంగా 63 కేసులు నమోదయ్యాయని, ఈ కేసులు పరిష్కరించడంతో పాటు పరిహారం సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో సివిల్‌ రైట్స్‌ డే సందర్భంగా నిర్వహించే సభలలో పంచాయతీరాజ్‌, పోలీస్‌, రెవెన్యూ, అటవీ, ఆరోగ్యం సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలని, రాజస్వ మండల అధికారి ఈ మేరకు పర్యవేక్షించాలని, ఆయా మండలాల తహశిల్డార్ల సమన్వయంతో గ్రామసభల వివరాలు అందిరికీ తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. లక్షైట్టిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దమ్ముగూడెం, దండేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బిక్కనగూడ, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లి, కన్నెపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల బాధితులకు జీ.ఓ.29 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పునరావాసం అమలు చేయాలని తెలిపారు. నమోదైన కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని, తప్పుడు కేసులు నమోదు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల నిరపరాధులకు నష్టం జరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికార యంత్రాంగం మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, కేసుల పరిష్కారంలో భాగంగా చేసే డి.ఎన్‌.ఎ. నివేదిక ఆలస్యం కాకుండా అధికారులు దృష్టి సారించాలని, ఎఫ్‌.ఐ.ఆర్‌. విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పోలీసు వారు జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్‌ ఎ.సి.పి.లు అఖిల్‌ మహాజన్‌, నరేందర్‌, బెల్లంపల్లి ఎ.సి.పి. ఎడ్ల మహేష్‌, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఈ.ఓ. దుర్గాప్రసాద్‌, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్‌ అలీ అప్సర్‌, కమిటీ సభ్యులు జిల్ల పెల్లి వెంకటేష్‌, రేగుంట లింగయ్య, బచ్చల అంజయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post