ప్రచురణార్ధం
ఆగష్టు 10 ఖమ్మం:
జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల భూ సమస్యలపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కల్లూరు డివిజనల్ పరిధిలో గల భూ సమస్యలపై అటవీ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కల్లూరు డివిజన్లోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో వ్యవసాయ భూములకు జారీ చేయబడిన, ఇంకను అర్హులైన రైతులకు జారీచేయవలసిన పట్టదారు పాసుపుస్తకాలు, సర్వేనెంబర్ల రికార్డులతో సహా దీనితో పాటు భూరికార్డుల నవీకరణ సందర్భంగా చేపట్టిన మొదటి, రెండవ సర్వే ప్రకారం అర్హులైన రైతులు, వ్యవసాయ భూముల సమగ్ర నివేదికను సమర్పించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా కల్లూరు డివిజన్ పరిధిలో గల అటవీ-రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలు, కోర్టు కేసులపై తీసుకున్న చర్యలపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి తదుపరి చర్యకై నివేదికను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ ఎన్ మధుసూధన్, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏ.డి రాము, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు తహశీల్దార్లు మీనన్, రమాదేవి, మంగీలాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.