జిల్లాలో ఇంకనూ ప్రయివేటు స్థలాల్లో కొనసాగుతున్న నర్సరీలను ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఎం.పి.డి.ఓలను ఆదేశించారు.

ప్రచురణార్ధం

. సెప్టెంబరు, 24 ఖమ్మం:

జిల్లాలో ఇంకనూ ప్రయివేటు స్థలాల్లో కొనసాగుతున్న నర్సరీలను ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఎం.పి.డి.ఓలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఎం.పి.డి.ఓలు, ఏ.పి.ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణకు హరితహారం, నర్సరీల నిర్వహణ, కంపోజ్డ్ షెడ్స్, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, ఇంకనూ పెండింగ్లో ఉన్న పనుల పురోగతి, కల్లాల నిర్మాణాల పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలితో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం విజయవంతానికి నర్సరీలే పునాదులని, ప్రతి నర్సరీలో నీటివసతి, నర్సరీల సంరక్షకుల బాధ్యతలు సక్రమంగా ఉండాలని, ఇంకనూ ప్రయివేటు స్థలాల్లో నిర్వహించబడుచున్న నర్సరీలను వెంటనే గుర్తించిన ప్రభుత్వ స్థలాలోకి మార్చాలని, 10 కుంటల కంటే తక్కువ లేకుండా నర్సరీల ఏర్పాటుకు స్థల విస్తీర్ణం ఉండాలని, నర్సరీలను మార్చే సమయంలో అన్ని మొక్కలను తప్పనిసరిగా తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. నూతన నర్సరీలకు చైన్ లింక్ ఫెన్సింగ్ తప్పనిసరిగా ఉండాలని రాబోయో 20 సంవత్సరాల వరకు ఉపయోగంలో ఉండే విధంగా నర్సరీల స్థలాలను ఎంపిక చేసి అట్టి ప్రభుత్వ స్థలాలలో నర్సరీలను మార్చాలని కలెక్టర్ ఎం.పి.డి.ఓలను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయితీ నర్సరీలో గృహ అవసరాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ సంస్థలు తదితర అవసరాలకు అనుగుణంగా నర్సరీలలో మొక్కల పెంపకం ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎం.పి.డి.ఓలు అన్ని గ్రామ పంచాయితీల నర్సరీలను సందర్శించి గ్రీన్ యాక్షన్ ప్లా న్ ను సమర్ధవంతంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. నర్సరీల నిర్వహణ పట్ల గ్రామ పంచాయితీ కార్యదర్శులతో పాటు ఎం.పి.డి.ఓలు, ఏ.పి.ఓ.లు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీకి అవసరమైన వసతులను సమకూర్చుకున్నామని, గ్రామ పంచాయితీ నిధులు సద్వినియోగపర్చుకొని గ్రామాభివృద్ధికై గ్రామ పాలనను మరింత పటిష్టం చేయాలని, గ్రామ పంచాయితీ రికార్డులు సక్రమంగా నిర్వహణ జరిగేలా ఎం.పి.డి.ఓలు ప్రతి గ్రామపంచాయితీ రికార్డులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఇంకనూ పెండింగ్లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్రావు, ఎం.పి.డి.ఓలు, ఏ.పి.ఓలు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post