జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

గురువారం నాడు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సందర్బంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ లతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి ఉషోగ్రతలు అధికం అవుతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలతో పాటు త్రాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే 1800-599-9333 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వివరిస్తూ, పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మే నెల 6 తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించబడే పరీక్షలకు గాను జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 7124 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరానికి గాను, 7018 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి. గాన పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు నియమించడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మే 23 వ తేదీ నుండి జూన్ 1వ తేదీ తేదీ వరకు జరిగే పరీక్షలకు 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 9488 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇందుకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా బస్సులను నడపడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, వైద్య సిబ్బందిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎలాంటి అవాంఛ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ను అమలు చేస్తామని, పరీక్షా సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ, జిల్లా ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి సంజీవ, అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.

Share This Post