జిల్లాలో ఉన్న 55వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలలో జూన్ 3న శనివారం రోజున రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3న నిర్వహించే రైతు దినోత్సవ వేడుకలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఉన్న 55రైతు వేదికలను శుభ్రం చేసి, ల్యాండ్ లెవెలింగ్ , ఫ్లెక్సీల ఏర్పాటు, టెంట్లు ఏర్పాటు, పూలు డెకరేషన్ లైట్ లతో అలంకరణ మొదలైన పనులు పూర్తి చేసి శనివారం రైతు దినోత్సవంకు సన్నద్ధం కావాలని అన్నారు.
శనివారం ఉదయం గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో రైతులు రైతు వేదికల వద్దకు బతుకమ్మ, బోనాలతో, డప్పు చప్పులతో ఊరేగింపుగా రావాలని, ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గోనాలని, గ్రామాలలో రైతుల ఊరేగింపు వీడియోలు తీయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతుకు వేదిక వద్ద ఏర్పాటు చేసిన భోజనం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రైతులందరికీ నాణ్యతతో కూడిన భోజనం అందించాలని, భోజనాలు వడ్డించే సమయంలో అవసరమైన మేర కౌంటర్ లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
రైతు వేదికలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల పాటు వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని గ్రామాల వారీగా రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెరిగిన గోదాముల సామర్థ్యం, ధాన్యం కొనుగోలు మొదలగు వివిధ అంశాల ద్వారా రైతులకు అందించిన సహకారం వివరించాలని కలెక్టర్ తెలిపారు.
రైతు వేదికల వద్ద మంచినీటికి, టాయిలెట్లకు, నీడ ఏర్పాట్లకు, ప్రాథమిక వైద్య ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని ప్రతి అంశంలో అలసత్వం లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, ,dro వాసు చంద్ర,pd drda శ్రీనివాస్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.