జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి దరఖాస్తులన్నిటిని ఈ నెల 20లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

సోమవారం నాడు ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్, స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ మున్నగు అంశాలపై అన్ని జిల్లాల  కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ  అమలు చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జిఐఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని పరిశీలించాలని,  18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. డిసెంబర్ 20, 2021లోగా  అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2022 న తుది ఓటరు జాబితా రూపొందించాలని ఆయన తెలిపారు.  జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను  రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, గరుడ  యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్  వినియోగిస్తూ పరిష్కరించాలని, వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. కోవిద్ నిబంధనలతో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి,  ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ నీలిమ,  అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి దరఖాస్తులన్నిటిని ఈ నెల 20లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

Share This Post