జిల్లాలో కంటి వెలుగుకు ప్రజలనుండి మంచి స్పందన-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

@ సమిష్టి కృషితో జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలి

@ జిల్లాలో కంటి వెలుగుకు ప్రజలనుండి మంచి స్పందన-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన ఉందని జిల్లా కలెక్టర్
ఎస్. వెంకటరావు తెలిపారు.

గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాత పాలమూరు కమ్యూనిటీ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటలకే ప్రజలందరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కంటి వెలుగు కేంద్రాలకు రావడం సంతోషమని అన్నారు. “సర్వేంద్రియానం నయనం ప్రధానం” అన్నారని, అలాంటి కంటికి సంబంధించి కంటిచూపుతో ఇబ్బందులు పడేవారి కి వైద్య పరీక్షలు నిర్వహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గడచిన 15 రోజులుగా జిల్లా యంత్రాంగం జిల్లా కేంద్రంతో పాటు, అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున అవగాహన కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్
వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఇదివరకే జిల్లా స్థాయిలో కంటి వెలుగుపై సమావేశాలు నిర్వహించడమే కాకుండా, పట్టణ ,గ్రామ ప్రజలను చైతన్యం చేయడం, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం వంటివి పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతేకాక ఎక్సైజ్ శాఖ మంత్రి చొరవతో ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించేందుకు కూడా ప్రణాళిక రూపొందించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరు కంటి పరీక్ష చేయించుకునే విధంగా శిబిరాలకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగుకు సంబంధించి సిబ్బంది అందరికీ పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిబిరాలకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దదని, ఈ విడత కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారు. సమిష్టి కృషితో జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్య లై ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయించాలలనికోరారు.

కంటి చూపు లేకుంటే జీవితమే లేదని,కంటి చూపు లోపంతో బాధ పడే ప్రజల కళ్ళల్లో వెలుగు నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని అవయవాలలో కన్ను అతి ముఖ్యమైనదని, కంటిచూపు లేకుంటే జీవితమే లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కంటి ప్రాముఖ్యతను గుర్తించి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. పేద ప్రజలు ముఖ్యంగా గ్రామాలలోని ప్రజలు నిర్లక్ష్యంతో కంటిచూపు మందగించినప్పటికీ చికిత్స చేయించుకోలేక , నిరుపేదలు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేసుకునే అవకాశం లేక అలాగే ఉండిపోతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటివారికి కంటి వెలుగు ప్రసాదించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవరు నిర్వహించని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఎవరికి వారు కంటి పరీక్షలు చేయించుకోవడమే కాకుండా, చుట్టుపక్కల వారికి కూడా కంటి పరీక్షలు చేయించేలా శిబిరాలకు తీసుకురావాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ కంటి వెలుగుపై వివరించగా, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ తిరుపతమ్మ ,కంటి వెలుగు ప్రాజెక్టు అధికారి ప్రోగ్రాం అధికారులు వినోద్ రెడ్డి, మోతిలాల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నటరాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

 

 

Share This Post