జిల్లాలో కురుస్తున్న బారీ వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు’ చర్యలతో రాగల 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 17 ఖమ్మం:

జిల్లాలో కురుస్తున్న బారీ వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలతో రాగల 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా, మండల స్థాయి నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్, విద్యుత్, పోలీసు శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులను మరింత అప్రమత్తం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత 10 నుండి 12 గంటల లోపు భారీ వర్షపాతం నమోదు అయిందని కొన్ని మండలాలలో 100 మి. మీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదు అయిందని, వైరా, కామేపల్లి, తల్లాడ, కూసుమంచి, ముదిగొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదయిందని, అధిక వర్షాలవల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వాగులు, వంతెనల నీటి ప్రవాహంవల్ల లో-లెవల్ క్యా జ్వేలు, చష్టాలు, రోడ్లపైకి నీటి ప్రవాహం. ఉన్న ప్రాంతాలలో ప్రజారవాణ, ఇతర వాహనాలను పూర్తిగా నిషేధించాలని, ఇట్టి ప్రాంతాలకు 2.కి.మీ ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్ళించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి ప్రవాహం. ఉన్న రోడ్లకు ఇరువైపుల బ్యారికేడింగ్ ఏర్పాటు చేయలన్నారు. అదేవిధంగా గండిపడే అవకాశం ఉన్న చెరువులు, ఇతర నీటి వనరులను ముందుగానే గుర్తించి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలలో శిభిరాలు ఏర్పాటు చేసి వసతి, భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. వరదలపట్ల అప్రమత్తంగా ఉంటూ సత్వరమే స్పందించడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టం నుంచి ప్రజలను రక్షించవచ్చని కలెక్టర్ తెలిపారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓలు రాగల 48 గంటలు నిరంతరాయంగా విధులలో ఉండాలని తదనుగుణంగా షిఫ్ట్ ల వారీగా విధులను కేటాయించుకొని ప్రత్యేకంగా రాత్రి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు వి.ఆర్.ఓ, వి.ఆర్.ఏల భాగస్వామ్యంతో ప్రతి నీటి వనరులను తణిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు.. జిల్లా ప్రజల సౌకర్యార్ధం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగిందని 24 గంటల నిరంతరాయంగా కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని, 1077 టోల్ ఫ్రీ నెంబరుతో పాటు 9063211298 నెంబరుకు కూడా ప్రజలు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమీషనర్ విష్ణు యస్. వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూధన్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్, విద్యుత్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మండల ప్రత్యేక అధికారులు, పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు తదితరులు టెలీకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

 

Share This Post