జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ మొదటి డోస్ వందశాతం పూర్తి చేసేందుకు విశేష సేవలందించిన అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది సేవలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 27, ఖమ్మం:

జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ మొదటి డోస్ వందశాతం పూర్తి చేసేందుకు విశేష సేవలందించిన అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది సేవలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ మొదటి డోసు వందశాతం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి కేక్ కట్చేసి, వైద్యాధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్నే చుట్టిముట్టిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో మన దేశం, రాష్ట్రం కోవిడ్-19 తీవ్రతను సమర్ధవంతంగా ఎదుర్కొని సమస్యలను అధిగమించిందన్నారు. వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాక ముందు కోవిడ్ ఉద్భతంగా ఉన్న సమయంలో కంటోన్మెంట్, రెడ్ జోన్లు, ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, మెడిసిన్, ఆక్సిజన్, అవసరమైన బెడ్స్ సమకూర్చి, ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో రెమిడెసివర్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచి పేషెంట్లకు వైద్య చికిత్స అందించి ప్రాణాపాయం నుండి కాపాడ గలిగామని మంత్రి తెలిపారు. వ్యాక్సినేషన్ వచ్చిన పిదప సూపరిస్పైడర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ అందించడంతో పాటు 18 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ అందించడంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 10 లక్షల 61 వేల 799 మందికి మొదటి డోసు అందించి వందశాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకున్నామని, అదేవిధంగా 73 శాతం రెండవ డోసు టీకాను పూర్తి చేసుకున్నామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే రెండవ డోసు 100 శాతం పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను కూడా రెండుసార్లు కోవిడ్-19 బారిన పడినప్పటికి మనో ధైర్యంతో ఎదుర్కొని ప్రజలకు సేవలందించగలిగానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దేశంలోనే పెద్ద రాష్ట్రాలలో అత్యధిక శాతం మందికి టీకాలు వేసి ముందంజులో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని మంత్రి తెలిపారు. వ్యవసాయదారులు, కార్మికులు, కూలీలు పనిచేసే చోటికే వెళ్ళి వ్యాక్సినేషన్ అందించడం ద్వారా జిల్లాలో 100 శాతం మొదటి డోసు పూర్తి చేసుకున్నామని, మొదటి డోసు వేసుకొని రెండవ డోసుకు గడువు పూర్తి చేసున్న వారిని గుర్తించి టీకాలు వేయడం ద్వారా జిల్లాలో రెండవ డోసు కూడా 100 శాతం త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వందశాతం. పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నామని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల స్పూర్తితో ప్రజలందరిని చైతన్యపర్చి అధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, అనుబంధ శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహాకారంతో లక్ష్యాన్ని చేరుకోగలిగామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు వందశాతం పూర్తి చేసుకున్న స్పూర్తితో అతి త్వరలోనే రెండు డోసు వందశాతం పూర్తి చేస్తామన్నారు. ప్రజలను చైతన్యపర్చి ప్రతి ఒక్కరూ టీకా తీసుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, రాత్రి సమయంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించామని, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో పాటు మండల ప్రత్యేక అధికారులు అద్భుతంగా పనిచేసారని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 270 ప్రభుత్వ, 10 ప్రయివేటు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదువందల మంది అధికారులు, సిబ్బందిని భాగస్వాములు. చేయడం ద్వారా మొదటి డోసు వందశాతం పూర్తి చేసుకున్నామని, దీనితో పాటు ఇప్పటికే 73 శాతం రెండవ డోసు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని, అతిత్వరలోనే రెండవ డోసు 100 శాతం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

ప్రోగ్రాం అధికారి, వ్యాక్సిన్ కో-ఆర్డినేటర్ డా॥సైదులు, కూసుమంచి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డా|| శ్రీనివాసరావు, బోదులబండ పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డా॥ రాజేశ్వర్, చెన్నూరు పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డా॥శ్రవణ్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు.

సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, మండల ప్రత్యేక అధికారులు, పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post