జిల్లాలో క్రొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

జిల్లాలో క్రొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం, స్వీప్ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు అందించాలని, ఓటరు జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ 17 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని, వారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు వస్తుందని, ఇక పై ప్రతి సంవత్సరం 4 సార్లు(జనవరి 1, ఏప్రిల్ 1 జూలై 1, అక్టోబర్ 1) ఓటర్ జాబితా అప్ డేట్ అవుతుందని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి బూత్ స్థాయి అధికారి తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి నూతన ఓటర్ల నమోదు చేపట్టాలని ఆయన తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించే సమయంలో 17 సంవత్సరాలు నిండిన వారి వివరాలు, కుటుంబాల్లో మరణించిన సభ్యుల వివరాలు, వివాహమైన వారి వివరాలు, ఉపాధి దృష్ట్యా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలు సేకరించాలని అన్నారు. జిల్లాలో విద్యాసంస్థల్లో 31,550 మందిని గుర్తించి, ఇప్పటికి 8,547 మంది నుండి ఫామ్-6 ను స్వీకరించినట్లు, మిగతా అందరి నుండి ఫామ్-6 స్వీకరించాలన్నారు. కళాశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతివారం రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటుచేసి, వారి నుండి అభ్యంతరాలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈఆర్ఓ స్థాయిలో సూపర్ చెక్ చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, ఆర్డీవో లు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎస్డీసి దశరథ్, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post