జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కు 141 కేంద్రాల ఏర్పాటు:: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు జిల్లాలో 141 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మంధిరంలో సివిల్ సప్లయిస్, సహకార శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వానాకాలం పంట, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ కు సంబంధించి జిల్లాలో 3 లక్షల 61 వేల మెట్రిక్ టన్నుల అంచనాల మేరకు 141 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐకేపీ ద్వారా 48 కేంద్రాలు, పి.ఏ.సి.ఎస్ ద్వారా 91, ఏ.ఎం.సి ద్వారా 2 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. యాసంగి పంట కాలంలో వివిధ రకాల ప్రైవేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని, అదేవిధంగా నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలన్నారు. జిల్లాలో యాసంగి సాగుకు అనుకూలమైన శనగ, పెసర, మినుములు వంటి పప్పుదినుసులు అదేవిధంగా వేరుశనగ, నువ్వులు, ఆవాలు వంటి నూనెగింజల పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని రైతులకు సూచించారు. ఇట్టి పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సీడ్ కార్పొరేషన్ ,అధికృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. రబీ సీజన్లో సీడ్ ప్రొడక్షన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని అన్నారు. సీడ్ ప్రొడక్షన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంటల సాగులో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉన్నచో రైతు వేదికల ద్వారా జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 58 రైస్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. ఫైన్ రైస్ (సన్న రకం) ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంసిద్ధత వ్యక్తం చేసినందున రైతులు సన్నం బియ్యం వరి వేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.
సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు. మెట్ట ప్రాంతాలలో బోర్లు, బావుల క్రింద పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను అధిక మొత్తంలో సాగు చేయవల్సిందిగా రైతులకు కలెక్టర్ సూచించారు.

కొనుగోలు కేంద్రంలో అవసరమైన టార్పాలిన్లు, తూకపు మిషన్లు, తేమ నిర్ధారణ శాతం పరికరాలు అందుబాటులోఉంచాలని ఆదేశించారు. రైతులు కూడా ధాన్యాన్ని తూర్పారబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు వ్యవసాయ విస్తరణాధికారులు ధాన్యం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ధృవీకరణ పత్రం జారీచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్య కొనుగోలులో మధ్య దళారుల ప్రమేయం ఉండకూడదని, రైతులకు నష్టం కల్గించే చర్యలు చేస్తే కఠినచర్యలు తప్పవని ఆయన అన్నారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంద్యారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా సివిల్ సప్లయిస్ అధికారిణి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయిస్ అధికారిణి కృష్ణవేణి, జెడి వ్యవసాయ శాఖ ఉషదయాల్, ఏడి వ్యవసాయ శాఖ దామోదర్ రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ శాఖాధికారి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post