జిల్లాలో గంజాయి, కలప అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్ట్ 10:–

జిల్లాలో గంజాయి, కలప అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రమణకుమార్ తో కలిసి గంజాయి,కలప అక్రమ రవాణా పై పోలీస్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత గంజాయి మహమ్మారి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా సరిహద్దుల నుండి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం దృష్టికి వచ్చిందన్నారు. అన్ని శాఖలు సంబంధిత సమాచారాన్ని సేకరించాలని, గంజాయి అక్రమ రవాణా సమాచార వ్యవస్థ కోసం గ్రామస్థాయి అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

గంజాయి అమ్ముతున్న, కొంటున్న, వినియోగిస్తున్న సమాచారం ఆరా తీయడానికి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టడం పై దృష్టి సారించాలన్నారు. అమ్మకాలు వినియోగంపై లోతుగా పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సూక్ష్మ స్థాయిలో పరిశోధించి అరికట్టాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పట్టుకునే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పంట నమోదు సమయంలో వ్యవసాయ విస్తరణ అధికారులతో జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు అవుతున్నట్లైతే వివరాలు అందజేయాలని జేడీకి సూచిస్తామ న్నారు.

జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువని అటవీ ప్రాంతాన్ని, చెట్లను కాపాడుకోవాలని, చెట్లను నరికి అక్రమ కలప రవాణా చేస్తున్న వారిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కలప అక్రమ రవాణా చైన్ లింక్ ఉంటుందని, దాన్ని ఛేదించేలా అటవీశాఖ అధికారులు పనిచేయాలని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెట్టాలని సూచించారు. స్మగ్లింగ్ కార్యకలాపాలు పకడ్బందీగా అరికట్టాలని, చెట్లు కొట్టకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల దన్నారు.

జిల్లా ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా వినియోగంపై క్షేత్రస్థాయిలో యాక్షన్ రూపంలో చూపించాలన్నారు. సంబంధిత చట్టాలు ఆయా శాఖలకు ఇచ్చిన అధికారాలపై ఆయన వివరించి దిశా నిర్దేశం చేశారు. ఇలాంటి కేసుల్లో జరిమానా ఇతర కేసుల కన్నా పెద్ద మొత్తంలో ఉంటుందని తెలిపారు. బైండోవర్ లో క్లియర్ ప్రొవిజన్స్ ఉన్నాయని, అవి అన్ని వినియోగించుకోవాలని సూచించారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇచ్చినా, వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. అటవీ భూముల్లో గంజాయి సాగు చేస్తున్న సమాచారాన్ని ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. నేరాన్ని రుజువు చేయడంలో పోలీస్ అధికారులు అన్ని ప్రొవిజన్స్ పాటించాలన్నారు. గంజాయి వినియోగిస్తున్న వారిని గుర్తించాలని సూచించారు. అన్ని శాఖలు సంయుక్తంగా పని చేసినట్లయితే ఫలితం వేగవంతంగా వస్తుందని అన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదని, జిల్లాలో ప్రభుత్వ భూములు, భవనాల పరిధిలో మొక్కలు నాటాలన్నారు. హరితహారం లో పెట్టిన చెట్లు నరికితే వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏ చెట్టు నరకాలన్నా అనుమతి తప్పనిసరి అని తెలిపారు. చెట్లు కొట్టడం, మేకలు ఇతర పశువులను మేపినా నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. కలప ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాహనాల ఫార్మెట్ లను విధిగా పరిశీలించాలని పోలీస్ అధికారులకు తెలిపారు.

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఏ ప్రాంతాలలో రవాణా వినియోగం అమ్మకాలు జరుగుతున్నదన్న పూర్తి సమాచారంతో చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమాచారాన్ని షేర్ చేసుకుంటే గంజాయి అక్రమ రవాణా నియంత్రణ సులువు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు డీఎస్పీలు, రెవిన్యూ డివిజనల్ అధికారులు ,అటవీశాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ సి ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post