జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ధెశిత గడువులోగా పూర్తి చేయాని, అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్ది, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల శాసనసభ్యులు ఆత్రం సక్కు కోనేరు కోనప్ప, జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారామ్‌లతో కలిసి జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల పనులలో ఆలస్యం జరుగుతుందని, రికార్డులలో, క్షేతస్థాయిలో పనులపై పొంతన లేని సమాధానం చెబుతున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వెలిబుచ్చారు. మిషన్‌ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటూ పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని, నీటి సరఫరాలో చింతలమానెపెల్లి, బెజ్టూర్‌, కౌటాల మండలాలోని (గ్రామాలకు ఏర్పడిన అంతరాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రహదారుల ఏర్పాటులో అటవీ శాఖ నుండి రావలసిన అనుమతుల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ వరకు పూర్తి చేయాలని సూచించగా సంబంధిత 8 ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించడం జరిగిందని, మిగతా వాటిని త్వరగా పూర్తి చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి సమాధానం ఇచ్చారు. జిల్లాలో ఎక్కడా విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా సరఫరాలో అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రతి సోమవారం మండల కేంద్రాలలో అన్ని శాఖల అధికారులతో గ్రీవెన్స్‌ నిర్వహించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోద్బ్పడాలని, నిర్దేశిత గడువు లోగాపనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, తిర్యాణి మండలంలో అనేక చోట్ల రహదారులు లేక ప్రజలు తీవ ఇబ్బందులు పడుతున్నారని, టెండర్‌ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించలేదని, ప్రజా అవసరాల నిమిత్తం తాత్కాలిక రహదారి నిర్మించాలని తెలిపారు. లింగాపూర్‌, వాంకిడి మండలాలలో కొన్ని గ్రామాలకు కర్ర స్తంభాలకు విద్యుత్‌ వైర్లు బిగించి ఉన్నాయని, వాటిని తొలగించి నూతన సిమెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సిర్పూర్‌ శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి సరిగా లేదని, కాగజ్‌నగర్‌ నుండి పెంచికల్‌పేట వెళ్ళే రహదారికి సంబంధించి గుత్తేదారు గతంలో ఎన్నోసార్లు మరమ్మతులు చేశారని, అందవెల్లి వద్ద నూతన వంతెన నిర్మాణం వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెంచికల్‌పేట – సలుగుపెల్లి మధ్య విద్యుత్‌ లైన్‌ పనులు పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post