జిల్లాలో జలవనరులు, నీటిపారుదల ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 16 ఖమ్మం:

జిల్లాలో జలవనరులు, నీటిపారుదల ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, నీటిపారుదల శాఖ స్థలాల పరిరక్షణ చర్యలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని లకారం, ఖానాపురం ఊరచెరువుతో పాటు వెలుగుమట్ల, ధంసలాపురం చెరువుల పరిధిలో ఆక్రమణలను గుర్తించి సత్వరమే హద్దులను ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాలలోని జలవనరులలో జరిగిన ఆక్రమణలపై యద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లకారం, ఖానాపురం ఊర చెరువు విస్తీర్ణం, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఖమ్మం నగరపాలక సంస్థలో గల చెరువులు ఆక్రమణలను వెంటనే తొలగించి వాటిని పూర్వస్థితికి తెచ్చి అభివృద్ధి పర్చాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా అన్ని లేఅవుట్లను తణిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని, ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్స్, నిర్ధారణ చేసి సరిహద్దులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో జరిగే నిర్మాణాలకు అనుమతులను జారీచేసే ముందు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తణిఖీ చేసిన అనంతరమే అనుమతులు జారీచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో జలవనరులు, జల ప్రవాహాల ప్రదేశాలు, నీటిపారుదల స్థలాలో ఆక్రమ నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

నగరపాలక సంస్థ కమీషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ జి. శంకర్నాయక్, పర్యవేక్షక ఇంజనీరు టి.వెంకటేశ్వరరావు, ల్యాండ్ సర్వే ఏ.డి వి. రాము, అర్బన్ తహశీల్దారు శైలజ, నీటి పారుదల శాఖ డి. ఇలు, ఏ.ఇలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post