జిల్లాలో జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

 ఆగష్టు 09 ఖమ్మం:

జిల్లాలో జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నేషనల్ హైవేస్, అటవీ, ల్యాండ్ సర్వే, విద్యుత్, గ్రామీణ నీటిసరఫరా శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఖమ్మం- సూర్యపేట, ఖమ్మం-కోదాడ, ఖమ్మం-దేవరపల్లి, ఖమ్మం-వరంగల్, ఖమ్మం-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. జాతీయ రహదారులకు సంబంధించి ఇంకనూ పెండింగ్ భూసర్వేను త్వరగా పూర్తి చేయాలని, జాతీయ రహదారుల పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్పిడి, విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, వంతెనలకు సంబంధించి నీటిపారుదల శాఖ కెనాల్స్, ఇతర నీటి పథకాలు పెండింగ్ పనులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు అటవీశాఖకు సంబంధించిన పనులను చేపట్టేందుకు నిర్ధారిత రుసుం చెల్లింపులు స్వీకరించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అనుబంధ శాఖల అధికారుల బృంధం సంయుక్తంగా ఆయా ప్రదేశాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి, తమ శాఖలకు సంబంధించి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, నేషనల్ హైవేస్ ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గా ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పద్మ, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, సర్వేల్యాండ్ ఏ.డి రాము, విద్యుత్ శాఖ అధికారులు, మీషన్ భగీరథ డి.ఇ వాణిశ్రీ, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post