జిల్లాలో డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్ట్ 12:–
జిల్లాలో డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు.

గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులకు డెంగ్యూ ,సీజనల్ వ్యాధుల నియంత్రణ హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణ, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో అక్కడక్కడ డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా, సీజనల్ వ్యాధులు, డెంగ్యు వ్యాధి ప్రబలడానికి కారణాలు ,నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.

పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు. గురువారం నుండి సోమవారం వరకు 5 రోజులు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డ్రైడే గా నిర్వహించి ఉద్ధృతంగా డ్రైవ్ కొనసాగేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ ఐదు రోజులు అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్ లు , డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇల్లిల్లు తిరుగుతూ అవగాహన కల్పించాలన్నారు. ఎవరికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు.

గ్రామస్థాయి లో సర్పంచ్, వార్డు మెంబర్లు ,ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ,పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్ ,కమిషనర్ ,వార్డ్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నిల్వ నీటిని ఖాళీ చేయించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత డెంగ్యూ నివారణ చర్యలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించారు.

గ్రామాలు పట్టణాలలో లార్వా నిర్మూలన, దోమల నివారణకు అవసరమైన రసాయనాల స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయడం లాంటి చర్యలు చేపట్టాలని కోరారు. కొబ్బరి బోండాలు ,టైర్ల షాప్ ల యజమానులకు శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలన్నారు. వినకపోతే జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలన్నారు.

మురుగు కాలువలలో నీరు సాఫీగా పారేలా చూడాలని ,నీటి నిల్వ ఉండే గుంతలు పూడ్చాలని తెలిపారు.త్రాగు నీటి ట్యాంక్ లను ప్రతినెల 1,11,21 తేదీలలో శుభ్రం చేయించడంతో పాటు తగు మోతాదులో క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. పిచ్చి మొక్కలు, పొదలను తొలగించాలని, గ్రామంలోని అన్ని ఇన్స్టిట్యూషన్ లలో పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత త్రవ్వుకునెలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. మహిళా సంఘాల మహిళలతో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని
డి ఆర్ డి ఓ కు సూచించారు.

తడి పొడి చెత్త సేకరించడం , సెగ్రిగేషన్ షెడ్ కు తరలించడం, కంపోస్టు ఎరువు తయారుచేయడం, తయారైన ఎరువును హరితహారం మొక్కలకు వేయడం నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని తెలిపారు. హరిత హారంలో నాటిన మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలకు నీటిని పెట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం వాటర్ డే గా ప్రకటించుకుందామని కలెక్టర్ పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ లో బహుళ వరసల మొక్కలు పెట్టాలని, గ్రీన్ విలేజ్ గా గుర్తింపు పొందేలా మొక్కలు నాటాలని, గ్రీన్ బడ్జెట్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను అద్భుతంగా మోడల్ గా చేయాలని కోరారు. పర్యావరణ సమతుల్యానికి అందరూ దృష్టి సారించాలన్నారు.

కోవి డ్ పట్ల ఇంకా అప్రమత్తంగానే ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలను పాతించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య , డిఎం అండ్ హెచ్ఓ గాయత్రి దేవి, డి పి ఓ, డి ఆర్ డి ఓ, మెడికల్ ఆఫీసర్లు ,ప్రోగ్రామ్ ఆఫీసర్ లు, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post