నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌గా 423 రోజుల పరిపాలనలో జిల్లా వాసులకు చేయగలిగినంత సేవలు అందించానన్న తృప్తితో వెళ్తున్నట్టు కలెక్టర్ శర్మన్ చెప్పారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ ఉత్తర్వులు తీసుకున్న తాను గురువారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ జిల్లా నుండి విడుదల అయ్యారు.
ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు కలిశారు.
ఈ సందర్భంగా శర్మన్ మాట్లాడుతూ….
జిల్లాలో కలెక్టర్‌గా పనిచేయడం తనకు మరువలేని గొప్ప అనుభూతి ఇచ్చిందన్నారు. దాదాపు 1 సంవత్సరం 1 నెల 28 రోజుల పాటు ప్రజలకు ప్రభుత్వ పరమైన సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరి సహకారంతో కొవిడ్ రెండో దశ సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని తెలిపారు.
కోవీడ్ నియంత్రణ సమయంలో సమష్టి కృషితో సజావుగా ఎదుర్కోగలిగామని చెప్పారు. హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమంల్లో పాల్గొనడం పండ్ల మొక్కలు నాటించడం వీధి వర్తక దారులకు రుణాలను అందించడం, మార్నింగ్ వాక్ నిర్వహించడం తన జీవితంలో తీపి గుర్తులుగా ఉంటాయన్నారు.
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి లో అగ్నిప్రమాద సందర్భంగా, చెంచుల ప్రమాద, వివిధ విపత్కర సందర్భంగా చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో అధికారులు, ప్రజల సహకారం మరువలేనిదన్నారు.
పల్లె, పట్టణ ప్రగతి లో భాగంగా జిల్లాలో తమ హయాంలో నిర్వహించిన కార్యక్రమాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
జిల్లా ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు దక్కిందని, తన పదవీకాలంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో కలెక్టర్ తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ ఆయన సేవలను పలువురు అధికారులు కొనియాడారు.
ఈనెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ శర్మన్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆయన ను కలిసిన వారిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, జిల్లా అధికారులు అనిల్ ప్రకాష్, సీతారాం, రాజేశ్వరి, నర్సింగ్ రావు, వెంకటేశ్వర్లు, గోవిందరాజులు, వెంకటలక్ష్మి, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ప్రజలు తదితరులు ఉన్నారు.