జిల్లాలో పరిపాలన భవనం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు అన్ని రకాల సేవలందించేందుకు అవకాశం మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

పత్రిక ప్రకటన

తేదీ : 17–08–2022

జిల్లాలో పరిపాలన భవనం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది
పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు అన్ని రకాల సేవలందించేందుకు అవకాశం
మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రత్యేకంగాలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు, ప్రజాప్రతినిధుల సంకల్పంతో అనుకున్న సమయంలో భవనాన్ని పూర్తి చేయడం జరిగిందని ఈ విషయంలో వారిని అభినందిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని షామీర్‌పేటలో వద్ద అంతాయిపల్లిలో రూ.56.20 లక్షలతో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాతో కలిసి ఉన్న సమయంలో మేడ్చల్‌ను ప్రత్యేక జిల్లాగా చేసందుకు ఎంతో చర్చ జరిగిందని ముఖ్యంగా మేడ్చల్ జిల్లాగా ఏర్పడుతుందని ఎవరూ కలలో కూడా కలగనలేదని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో కలిసి ఉన్నందున మూడు జిల్లాలుగా చేయడం అందులో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రత్యేకంగా ఏర్పాటు కావడం ఎంతో శుభపరిణామమని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా రూపాంతరం చేశామని ఈ విషయంలో ఎంతో చర్చ జరిగిందని సభలో గుర్తు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై పెద్దలు, అధికారులు, మంత్రులతో చర్చించామని ప్రజల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక జిల్లా అవసరమని కొత్త జిల్లాగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లాలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాల వారు జీవనం కొనసాగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల వారికి సులభంగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని రైతులకు అన్ని రకాల సేవలందించేందుకు రైతు వేదికలు నిర్మించడంతో పాటు ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశామని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లు ఉన్నాయని అవి కూడా కేవలం ఆరేడు నెలల్లోనే ఏర్పాటు చేసి రైతులకు గతంలో ఎన్నడూ అందని సేవలు అందుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. తాను కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలలో తిరిగిన వ్యక్తిగా వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు సులభతరంగా సేవలందుతాయని పనుల కోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసం ఉండదని సీఎం వివరించారు. రాష్ట్రంలో ప్రజలకు ఊహించనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల పైచిలుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని మరికొన్ని కూడా ఏర్పాటు చేస్తామని సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పింఛన్లను అందచేస్తున్నామని ఇది దేశంలో ఎక్కడ కూడా జరగడంలేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో పాటు గతంలో 36 లక్షల ఆయా రకాల పింఛన్లు ఉండగా ఈనెల 15 తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి మరో 10 లక్షల కొత్త పింఛన్లను ప్రభుత్వం అందిస్తుందని ఈ విషయంలో కరోనా వల్ల కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 లక్షల పింఛన్లను అందచేస్తున్నామని వీటికి కొత్తగా కార్డులను కూడా అందించడం జరుగుతుందని ఈ ప్రక్రియ రాబోయే వారం పది రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళి స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల ద్వారా కొత్త కార్డులను అందచేస్తారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమావేశంలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంచి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని గతంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక పవర్ హాలిడేలు ఇచ్చారని… ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ఉండేవని ప్రస్తుతం అవేమీ లేవని ముఖ్యమంత్రి సమావేశంలో గుర్తు చేశారు. ఆదిలాబాద్ గోండు ప్రాంతంలో వరంగల్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో మొదలుకొని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కూడా నాణ్యమైన కరెంట్ అందచేస్తున్నామని అంకితభావం ఉంటే మెదడును రంగరించి హృదయంతో పని చేస్తే అన్నీ సాధ్యమవుతాయని తెలిపారు. దేశంలోనే 24 గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో నీటికి ఎలాంటి కొరత లేదని శివారు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులను సైతం తీర్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో ఇబ్బందికర (టిపికల్) పనులు ఉంటాయని దీనిని దృష్టిలో ఉంచుకొని మేడ్చల్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు గతంలో కేటాయించిన రూ.5 కోట్లకు అదనంగా మరో రూ.10 కోట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లో సమస్యలన్నీ తీర్చాలని ముఖ్యమంత్రి సంబంధిత ఎమ్మెల్యేలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అద్భుతమైన నిధులు ఉన్నాయి మన వనరులు మనకు కావాల్సినంతగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని తెలుసుకొనేందుకు గీటు రాయి ప్రజల తలసరి ఆదాయమని ఈ ఆదాయం 2014లో లక్ష రూపాయలు ఉండగా ఎనిమిదేళ్ళలో ఎంతో పెరిగిందని ఇతర రాష్ట్రాలను అన్ని రంగాల్లో అధిగమించి ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం మొత్తం నివ్వెర పోతుందని ఈ విషయంలో ఎంతో సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 11 లక్షల కుటుంబాలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందని సీఎం వివరించారు. తెలంగాణలో కిడ్నీ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు అందచేయనున్నామని గీత, చేనేత, బోధకాలు సోకిన వారికి సైతం పెన్షన్లు అందచేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రస్తుతం వృద్ధుల వద్ద డబ్బులు ఉన్నాయని ఇది కేవలం వారికి ప్రతినెలా వచ్చే పెన్షన్ వల్లేనని తెలిపారు. మాకు మా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడు అనే ధీమాతో ఉన్నారని వారికి వస్తున్న పెన్షన్లు చూసి అత్తలు, అమ్మలకు మంచి ఆదరణ పెరిగిందని మన దగ్గర ఇప్పటికిప్పుడు ఎక్కువ డబ్బులు లేకున్నా వృద్ధుల వద్ద వారు ఖర్చు పెట్టుకోగా అందులో దాచుకున్న పెన్షన్ల ద్వారా ఒక్కొక్కరి వద్ద రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వారి బ్యాంకు ఖాతాల్లో ఉంటాయని ఇది ఎంతో సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలందరికీ బియ్యం ఆరు కిలోల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని జీఎస్డీపీలో ఎంతో ముందుస్థానంలో ఉన్నామని అన్నారు. 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5 లక్షల కోట్లు ఉండగా… ప్రస్తుతం అది రూ.11 లక్షల 50 కోట్లకు పెరిగిందని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల అంకితభావం, చిత్తశుద్ధి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 కలెక్టరేట్ కార్యాలయాలు, పోలీసుల భవనాలు నిర్మిస్తున్నామని రెసిడెన్షియల్ పాఠశాలలల్లో మంచి విద్యనందిస్తు విద్యార్థులు అన్ని రంగాల్లో పురోగతి చెందేలా చేస్తున్నట్లు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నట్లు వివరించారు.. రాష్ట్రంలో చెమటోడ్చి కష్టపడి సాధించుకొన్న అన్ని సౌకర్యాలు కాపాడుకోవాలని ఈ విషయంలో మోసపోతే గోసపడే పరిస్థితి ఉంటుందని ఇందుకు నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా హైదరాబాద్‌కు ఎంతో దగ్గరలో ఉందని ఈ ప్రాంతంలో వ్యవసాయం, కార్మికులు, ఫ్యాక్టరీలు ఉన్నాయని అందరూ ఐకమత్యంతో ఉండాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్నవన్నీ ప్రజల ఆస్తులని వాటిని కాపాడి మరింత పెంపొందించి భవిష్యత్తు తరాలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) శంభీపూర్ రాజు, నవీన్ రావు, సురభివాణీ దేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, నవీన్‌కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, తూముకుంట మున్సిపల్ ఛైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు, షామీర్పేట ఎంపీపీ దాసరి యెల్లు బాయి, షామీర్పేట జడ్పీటీసీ సభ్యరాలు మహంకాళి అనిత, తూముకుంట మున్సిపల్ కౌన్సిలర్ సింగిరెడ్డి రజినితో పాటు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post