జిల్లాలో (పాలియేటివ్ కేర్ ) ఉపశమన సంరక్షణ ప్రభుత్వ వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

మే 10 ఖమ్మం:

జిల్లాలో (పాలియేటివ్ కేర్ ) ఉపశమన సంరక్షణ ప్రభుత్వ వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉపశమన సంరక్షణ వైద్యసేవలు, 108 వైద్యసేవలు, ఆరోగ్యశ్రీ, తదితర వైద్య సేవలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలను పెంచాలని, రోజుకు కనీసం రెండు, మూడు శస్త్ర చికిత్సలు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవల ద్వారానే ప్రజలకు నమ్మకం కలుగుతుందని తదనుగుణంగా ఆరోగ్యశ్రీ. కింద జిల్లా ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగాలని కలెక్టర్ సూచించారు. 108 సేవల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరగాలని, గర్భిణీలను 108 వాహనాల ద్వారా ప్రైయివేటు ఆసుపత్రులకు తరలించే వాహనాల బాధ్యులు, డ్రైవర్లపై తగు చర్యలు తీసుకోవాలని 108 కో-ఆర్డినేటర్ను కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి తరలించబడే ప్రసవాల కేసులన్నీ నేరుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి 108 వాహనాల ద్వారా రావాలని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యాధికారులు సమయపాలన పాటించి ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్కు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. పాలియేటివ్ కేర్ వైద్యానికి సంబంధించి జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధిగ్రస్తులకు ఉపశమన సంరక్షణ వైద్యసేవలను అందిస్తూ మానసిక ఒత్తిడులకు లోనుకాకుండా రోగులకు వైద్యసేవలతో పాటు మనో ధైర్యాన్ని కల్పించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి వెంకటేశ్వర్లు, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, వైద్యాధికారులు డా॥ స్వప్పు, డా॥కోటి రత్నం, 108 కో-ఆర్డినేటర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post