జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారంపై సమన్వయంతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారంపై సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అటవీ, రవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని, గిరిజనులు కొద్ది మొత్తంలో మాత్రమే సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకే వ్యక్తి అధిక మొత్తంలో సాగు విస్తీర్ణం చేసే భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, పంట సాగులో గంజాయి సాగు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా అటవీ భూముల్లో గంజాయి సాగు చేస్తే వారి ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. రద్దు చేయడంతో పాటు పి.డి. యాక్ట్‌ నమోదు చేయడం, రైతుబంధు, ఇతర ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. జిల్లాలో గుడుంబా నివారణ కోసం ఆబ్బారీ, పోలీసు శాఖ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి అనుమానాస్పద ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలని తెలిపారు. జిల్లా ఎస్‌.పి. (అడ్మిన్‌) సుధీంద్ర మాట్లాడుతూ జిల్లాలో యువత చెడు మార్గాలకు వెళ్ళకుండా, మత్తుకు బానిసలు కాకుండా ఉందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారామ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, జిల్లా ఎక్సైజ్‌ శాఖ
అధికారిణి రాజ్యలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post