జిల్లాలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు 100% అందాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఏ ఒక్క మనిషి కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో మిషన్ భగీరథపై నాగర్ కర్నూల్, కొల్లాపూర్, ఇఇలు, డీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు.
డివిజన్ల వారీగా మంచినీటి సరఫరా పురోగతిని, ఏలూరు ప్లాంట్, జిల్లాలోని అన్ని నీటిశుద్ధి కేంద్రాల పాయింట్ల స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించి జిల్లాలో నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అధికారులు డివిజన్ల వారీగా పురోగతిని నీటి సరఫరా అంశాలను కలెక్టర్కు వివరించారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాల్లోని 710 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నదని చెప్పారు.
మరో 15 చెంచు పెంటలకు నాబార్డు పథకం ద్వారా బోర్లు వేసి చెంచు పెంటకు మంచినీరు అందిస్తున్నామని, జిల్లాలో దోమలపెంట గ్రామానికి మాత్రమే అందాల్సి ఉందన్నారు.
ఆ గ్రామానికి కూడా పాతాళ గంగ నుండి నీటిని శుద్ధి చేసి మార్చి 2022 నాటికి అందిస్తామని అధికారులు కలెక్టర్కు వివరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా లోని 8,15,148 మంది ప్రజలకు ప్రతిరోజు 815.148 మెట్రిక్ లీటర్ల మంచి నీటిని మిషన్ భగీరథ ద్వారా అందించడం జరుగుతున్నదన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల జిల్లాల్లోని మారుమూలలో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక లక్షా తొంభై మూడు వేల నీటి కొళాయి లతో మంచినీళ్ల సరఫరా 100% స్వచ్ఛమైన నీటి సరఫరా జరగాలని కలెక్టర్ ఆదేశించారు.
‘‘ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలన్నారు. ఏ ఒక్క రోజు మంచినీరు అందకున్నా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిషన్ భగీరథ నీటిని పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా గృహ సముదాయాల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు మిషన్ భగీరథ నీటిని ప్రతిరోజు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి రోజు 100 లీటర్ల, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున మంచి నీటిని 100% అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో కల్వకుర్తి ఈఈ పుల్లారెడ్డి, కొల్లాపూర్ ఈఈ సుధాకర్ సింగ్, నాగర్ కర్నూలు మిషన్ భగీరథ ఈఈ శ్రీధరరావు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Share This Post