జిల్లాలో ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీష్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

జనవరి, 28ఖమ్మం:

జిల్లాలో ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీష్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా, మండల స్థాయి వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇరు జిల్లాల్లో ఆరోగ్య పరిస్థితులు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇంటింటి జ్వర సర్వే, ఆసుపత్రి ప్రసవాలు, ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్, మహిళలు, కౌమారు దశ: బాలికలలో రక్తహీనత, సాధారణ ప్రసవాలు, గైనకాలజీ, ఆర్థో, కంటి శస్త్ర చికిత్సల పురోగతిపై రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి వర్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యాధికారులు ప్రజాసేవ కోసం అంకితభావంతో తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులు కోవిడ్-19 క్లిష్ట పరిస్థితులలో ప్రాణాలకు తెగించి సేవలందించారని, చిన్న పొరపాటు, నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా తమ బాధ్యతలు, విధులను మరింత సమర్ధవంతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక ఏకాగ్రత చూపుతున్నారని, రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి గాను రాష్ట్రంలో 18 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఒక్కొక్కటి 5 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి వ్యవస్థలో అసరాలు, లోపాలు ఉంటాయని, అవసరాలను తీరుస్తూ లోపాలను కూడా సవరిస్తామని, ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగం పోటీ తత్వంతో సేవలందించాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఔషధాల కొరత సమస్య రావద్దని, సర్జికల్, మెడికల్ కొరకు బడ్జెట్లో మరో వంద కోట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చామని, వైద్యాధికారుల నియామకాలకై జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించామని అన్ని వసతులను సద్వినియోగపర్చుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కోవిడ్-19 వ్యాక్సినేషన్లో మొదటి డోసు 103 శాతం, రెండవ దోసు 94 శాతం లక్ష్యాలను సాధించిందని, అతి త్వరలోనే రెండవ దోసు 100 శాతం పూర్తి చేసి దక్షిణ భారత దేశంలో మూడవ జిల్లాగా నిలవాలని, ఇప్పటికే బెంగుళూరు, కరీంనగర్ జిల్లాలు మొదటి రెండవ స్థానంలో నిలిచాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే ద్వారా లక్షణాలు కలిగిన వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చిన వారికి తదుపరి రోజు ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితులను వాకబు చేయాలని, ఇంటింటి జ్వర సర్వే రెండవ విడతను పూర్తి చేయడంతో పాటు 15-17 సంవత్సరాల వయస్సు కలిగిన వారి వ్యాక్సినేషన్ కూడా. త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.. కె.సి.ఆర్ కిట్స్ అందించడం, ఆసుపత్రులలో ప్రసవించిన మహిళలకు నగదు పారితోషకం అందించి ఉచిత రవాణాతో వారికి ఇంటికి చేర్చడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుండి 50 శాతానికి పెరిగిందని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రులు ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక టెక్నాలజీ, మానవ వనరులను పెంచినప్పటికి ఇంకనూ 3 శాతం ఇనిస్టిట్యూషన్ డెలవరీస్ జరుగుతున్నాయని, ఇరు జిల్లాల్లో ఇటువంటి గ్రామాలను గుర్తించి వందశాతం ఆసుపత్రి ప్రసవాలు జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణీలు రిజిస్ట్రేషన్ మొదటి, రెండవ, మూడవ ఏ.ఎన్. సి నమోదు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వందశాతం జరగాలని, ప్రతి వెయ్యి మందికి ఒక ఆశా వర్కర్లు, ప్రతి రెండు వందల మందికి ఒక ఏ.ఎన్. ఎమ్ ను కేటాయించడం జరిగిందని, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎమ్. ప్రతి గ్రామంలో గర్భిణీల వివరాలను తెలుసుకొని ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ చేయాలని, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతి పి.హెచ్.నీకు వెళ్ళి సమీక్షించాలని ప్రతి నెల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.హెచ్.సి వైద్యాధికారులతో సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో 80, శాతం మంది మహిళలు రక్తహీనత కలిగి ఉన్నారని ప్రతి నెలా రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించడం ద్వారా మహిళల్లో రక్తహీనతను తగ్గించాలని, గర్భిణీ స్త్రీల సమగ్ర సమాచారం ఫోన్ నెంబర్లతో సహా ప్రతి పి.హెచ్.సి డాక్టర్ వద్ద నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. జిల్లా మంత్ర వర్యులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గర్భిణీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య 28 శాతం మాత్రమే ఉందని, పుట్టిన గంటలో తల్లిపాలు ఇస్తే పిల్లలు అనేక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారని, సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మొదటి గంటలో తల్లి పాలు అందించాలని, ఇరు జిల్లాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచి సి-సెక్షన్ ప్రసవాలను పూర్తిగా అరికట్టాలని మంత్రి ఆదేశించారు. శస్త్ర చికిత్సలుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులలో చేరే ప్రతి పేషెంట్కు ఆరోగ్య శ్రీ కింద నమోదు చేయాలని, ఆర్థో, గైనిక్, కంటి శస్త్ర చికత్సలకు గాను ఆయుష్మాన్ భారత్ కింద ప్రవేశపెట్టిన సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్వాలిటీ ఎస్సురెన్స్ సర్టిఫికెట్ తేవాలని, తద్వారా సంవత్సరానికి 3 లక్షల గ్రాంట్ వస్తుందని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి 66 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరాలకు పల్లె దావఖానాల సబ్ సెంటర్లకు నిధులు విడుదల చేసామని, అన్ని సబ్ సెంటర్ల మరమ్మత్తులు, ఆధునికరణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో కల్తీ విక్రయాలను అరికట్టేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు మరింత అంకిత భావంతో పనిచేయాలని పనితీరును మెరుగుపర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా కాలపరిమితి దాటిన ఔషధాల విక్రయాలు జరుగకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిరంతర తణిఖీలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరింత మెరుగైన ప్రభుత్వ రంగ వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు గాను అత్యధునికి వైద్య సేవల రోగ నిర్ధారణ పరికరాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసుకోవడంతో పాటు సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రులను వంద పడకల ఆసుపత్రులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులచే ఆప్గ్రేడ్ పనులను నేడు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసుకుంటున్నామన్నారు. జిల్లాలో కోవిడ్-19 వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టడం జరిగిందని, మొదటి డోసు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసుకోవడంతో పాటు రెండవ డోసు 94 శాతం పూర్తి అయిందని, త్వరలోనే రెండవ దోసు వందశాతం పూర్తి చేసి ఖమ్మం జిల్లాను వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా నిలుపుతామని మంత్రి అన్నారు

జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ద్వారా ప్రతి ఆవాసానికి వ్యాక్సినేషన్ అందించడం జరిగిందని, సీనియర్ జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే బృంధాలకు హోమ్ ఐ సోలేషన్ కిట్స్ అందించడం ద్వారా లక్షణాలు కలిగిన వారు ఇంటివద్దనే చికిత్స పొంది పూర్తిగా కోలుకుంటున్నారని దీనికి సంబంధించిన నమోదు రికార్డులను కూడా క్రమపద్ధతిన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జ్వర సర్వేలో వ్యాక్సినేషన్ డేటాను కూడా సేకరిస్తున్నామని, తద్వారా రెండవ డోస్ తీసుకోవాల్సిన వారి డేటా సేకరణ సులువు అయిందన్నారు. రాష్ట్రఆరోగ్య శాఖ మంత్రివర్యుల సూచనలు, ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచుతామని, ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్లకై గర్భీణీలను మరింత చైతన్య పరుస్తామని, ఆరోగ్య శ్రీ పథకం వర్తింపచేయడం, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు క్వాలిటీ ఎస్సురెన్స్ సర్టిఫికెట్ తీసుకునేలా సత్వర చర్యలు చేపడ్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు తాతా మధుసూధన్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, ఆయూష్ కమీషనర్ అలుగు వర్షిణీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆనుదీప్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జీ కమీషనర్ రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.ఎస్.డి గంగాధర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు డా॥మాలతీ, డా॥దయానంద స్వామి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు డా॥బి. వెంకటేశ్వర్లు, సరళ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post